సర్వే.. సాగదీత | Sakshi
Sakshi News home page

సర్వే.. సాగదీత

Published Sun, May 28 2023 1:00 AM

కల్వకుర్తి శివారులో డీజీపీఎస్‌తో భూ సర్వే చేస్తున్న లైసెన్స్‌ సర్వేయర్లు (ఫైల్‌)  - Sakshi

నెలకు 200పైగా కొత్త దరఖాస్తులు

జిల్లాలో ఇప్పటికే 1,800పైగా పెండింగ్‌

డిజిటల్‌ వైపు మొగ్గు చూపుతున్న రైతాంగం

రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం

కల్వకుర్తి: ఎన్నో ఏళ్ల నుంచి భూమి సర్వే అనేది సాధారణ విషయం. కానీ, ఇప్పుడు అది అసాధారణ సమస్యగా మారిపోయింది. భూముల ధరలు పెరగడం, రియల్‌ ఎస్టేట్‌తో క్రయవిక్రయాలు అధికమవడంతో పంచాయితీలు నెలకొని.. హద్దుల ఏర్పాటుకు అవసరం ఏర్పడింది. దీంతో సర్వేకు అమాంతం డిమాండ్‌ పెరిగింది. భూ సర్వే చేయాలని అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా సర్వేలో వేగం పెరగడం లేదు. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో సర్వే చేయాలని నిబంధన ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. ఫలితంగా సకాలంలో సర్వే చేయకపోవడం, భాగాలుగా విభజించకపోవడంతో రైతులు ప్రైవేట్‌ సర్వేల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్‌ సర్వేల కోసం ఆసక్తి పెరిగింది. గొలుసుతో ఆలస్యం కావడంతోపాటు చెట్లు, పొదలు ఉంటే పనులు ఆలస్యంతోపాటు సరిగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిజిటల్‌ సర్వేతో వేగంగా పని జరగడం, నిక్కచ్చిగా ఫలితం వస్తుండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం మాత్రం వందేళ్ల నాటి గొలుసు కొలతలపైనే ఆధారపడటంతోపాటు.. వాటిలోనూ జాప్యం చేస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో 13 మండలాలకే..

జిల్లాలో మొత్తం 20 మండలాలకు గాను 13 మంది రెగ్యులర్‌ సర్వేయర్లు ఉన్నారు. మిగతా మండలాల్లో మూడు చోట్ల ఐకేపీ సర్వేయర్లు ఉండగా, మరో మూడు మండలాల్లో లైసెన్స్‌ సర్వేయర్లు పనిచేస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఒక ఏడీ అధికారి ఉండగా.. నాలుగు డివిజన్లకు గాను కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌కు మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. వీరే అచ్చంపేట, కొల్లాపూర్‌ డివిజన్లకు ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఇక తిమ్మాజిపేట, బిజినేపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో లైసెన్స్‌ సర్వేయర్లు పనిచేస్తుండగా.. బల్మూరు, లింగాల, కోడేరు మండలాల్లో ఐకేపీ సర్వేయర్లు ఉన్నారు. పదర మండలంలో పోస్టు ఖాళీగా ఉంది.

అధిక ధరలతో విపరీతంగా పెరిగిన డిమాండ్‌

వందేళ్ల క్రితం విధానంలో..

ప్రభుత్వ సర్వేయర్లు నేటికి వందేళ్ల క్రితం ఉన్న గొలుసులపైనే ఆధారపడుతున్నారు. ఆయా గ్రామాల్లోని సర్వే నంబర్‌కు ఒక టిపన్‌ ఉంటుంది. చాలా ఏళ్ల కిందట ఇవి తయారు చేయడంతో కాగితం దెబ్బతిన్న చాలా టిపన్లు పాడైపోయాయి. బాగున్న మంచి పేపర్లను స్కాన్‌ చేశారు. టిపన్‌ లేని చోట గ్రామ నక్ష ప్రకారం సర్వే చేస్తున్నారు. పూర్వం సర్వే చేసిన పొలంలో నంబర్ల హద్దులు నిర్ణయించిన సమయంలో రాళ్లు పాతారు. కొన్నిచోట్ల యంత్రాలతో దుక్కులు దున్నడం, పొదలు తొలిగించడంతో రాళ్లు పోయాయి. కొందరు రైతులు కావాలని తొలిగించిన సందర్భాలు ఉన్నాయి. ఇక మళ్లీ గుర్తించాలంటే చుట్టుపక్కల రైతల పొలాల్లో ఉన్న రాళ్ల నుంచి టిపన్‌ ప్రకారం కొలత చేయాల్సి ఉంటుంది. ఇందుకు చుట్టుపక్కల రైతులు సహకరించాలి. పొదలు, చెట్లు, రాళ్లు గోతులు, కాల్వలు అడ్డం ఉంటే గొలుసుతో కష్టమే. సర్వే అధికారులు వారి వద్ద ఉన్న జీపీఎస్‌ చిన్న యంత్రంతో చేస్తున్నారు. వాటితో లెక్కలు సరిపోల్చుకుంటారు. ప్రస్తుతం ఆధునిక డిజిటల్‌ (డీజీపీఎస్‌) యంత్రాలను వినియోగిస్తున్నారు. ఏమి అడ్డం ఉన్నా నిక్కచ్చిగా, వేగంగా సర్వే ఫలితం వస్తుంది. ప్రభుత్వం సైతం ఆ దిశలో పయనిస్తే వేగంతోపాటు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రభుత్వం కొత్తగా భూ సర్వే చేపడితే పట్టాదారులకు ఎంతో మేలు జరుగుతుంది.

జిల్లాలో దరఖాస్తులు ఇలా..

ఎవరైనా భూమి సర్వే చేసుకోవాలంటే సర్వే నంబర్‌కు రూ.295తో బ్యాంకులో గాని, మీసేవలో గాని చలాన్‌ తీయాలి. మూడు సర్వే నంబర్ల వరకు ఒక చలాన్‌ సరిపోతుంది. మూడు దాటితే మరో చలాన్‌ తీయాల్సి ఉంటుది. పాస్‌ పుస్తకం, కొత్త పహాణిలతో మీసేవలో సంప్రదిస్తే దరఖాస్తు చేస్తారు. ఈ దరఖాస్తు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరగా.. అక్కడి నుంచి సర్వేయర్లకు పంపిస్తారు. వారు 45 రోజుల్లో ఎప్పుడైనా సర్వేకు రావచ్చు. సర్వేకు వచ్చే ముందు చుట్టపక్కల రైతుల వివరాలు తెలుసుకొని వారికి నోటీసులు జారీ చేస్తారు. మండల అధికారి వచ్చి సర్వే చేసి పంచనామా అందజేస్తారు. రైతుకు నచ్చకపోతే ఆర్డీఓ పరిధిలోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సర్వేకు దరఖాస్తు చేయవచ్చు. అక్కడ సర్వే ఫలితం సక్రమంగా లేకపోయినా జిల్లా సర్వేయర్‌ (ఏడీ)కి అప్పీలు చేసుకోవచ్చు. డివిజనల్‌ సర్వే కోసం మూడు సర్వే నంబర్ల వరకు రూ.1,410 బ్యాంకులో చలాన్‌ తీయాలి. జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే కోసం జిల్లా కేంద్రంలోనే రూ.1,410 చలాన్‌ తీసి దరఖాస్తు చేసుకోవాలి.

రైతులు సహకరిస్తే..

ప్రస్తుతం సర్వే కోసం దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. చాలాచోట్ల చుట్టపక్కల రైతులు సహకరించకపోవడంతో సర్వేలు ముందుకు సాగక పెండింగ్‌లో పడుతున్నాయి. చాలామంది రైతులు పొలాలను భాగాలుగా చేయాలని అడుగుతారు. తాము కేవలం సర్వే హద్దులు గుర్తించి పొలం టిపన్‌ ప్రకారం ఉందా లేదా మాత్రమే చెబుతాం. భాగాలు విభజించడా నికి వీల్లేదు. దీంతో ప్రైవేట్‌ సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు.

– శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సర్వే అధికారి

Advertisement
Advertisement