ర్యాలీల జోరు.. నినాదాల హోరు | Sakshi
Sakshi News home page

ర్యాలీల జోరు.. నినాదాల హోరు

Published Fri, Nov 10 2023 5:02 AM

-

● మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి నామినేషన్‌ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీ జనసంద్రంగా మారింది. న్యూటౌన్‌ నుంచి బస్టాండ్‌ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. మంత్రి తన కూతురు, కుటుంబసభ్యులతో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

● దేవరకద్రలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన తల్లి వరలక్ష్మి, భార్య మంజుల, కూతుళ్లు, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా నామినేషన్‌ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌ రోడ్డులోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌పత్రాలు సమర్పించారు.

● జడ్చర్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రేమ్‌ రంగా గార్డెన్‌ నుంచి వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

● కొల్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు పార్టీ కార్యాలయం నుంచి.. కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు జగ్జీవన్‌రాం చౌరస్తా నుంచి వేర్వేరుగా ర్యాలీ నిర్వహిస్తూ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వరకు చేరుకున్నారు.

● అలంపూర్‌లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్‌ అలంపూర్‌ మున్సిపాలిటీలోని న్యూప్లాట్స్‌ కాలనీ నుంచి ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

● వనపర్తిలో నామినేషన్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి నిరంజన్‌రెడ్డి అంబేద్కర్‌ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజీవ్‌చౌక్‌లో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

● అచ్చంపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి చిక్కుడ వంశీకృష్ణ వేలాది మంది అనుచరులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ దాఖలు చేశారు.

Advertisement
Advertisement