బడా నేతల ఆగమనం! | Sakshi
Sakshi News home page

బడా నేతల ఆగమనం!

Published Sat, Nov 25 2023 1:36 AM

- - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: 'ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రధాన పార్టీల ముఖ్యనేతలతో అభ్యర్థుల ప్రచారం హోరెత్తింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బహిరంగసభలను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావుకు మద్దతుగా నిర్వ హించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈనెల 27న నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించనున్న కాంగ్రెస్‌ బహిరంగసభలో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయాపార్టీల అగ్రనేతల పర్యటనలతో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోనుంది.'

► కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్‌, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే అలంపూర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొడంగల్‌ బహిరంగసభల్లో పాల్గొన్నారు. అలాగే కర్ణాటక రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ పరిశీలకులతో ప్రచా రం ఊపందుకుంది. ఈ నెల 27న కోస్గి పట్టణ శివారులో నిర్వహించే సభలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. ఆదివారం మక్తల్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేయనున్నారు.

బీజేపీ జనాకర్షణ మంత్రం..
ఉమ్మడి జిల్లాలో బాగా కలిసొచ్చే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగసభ ల నిర్వహణకు బీజేపీ సిద్ధ మైంది. ఇందుకోసం కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపుతోంది. గత నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌ లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొ ని ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నారాయణపేటలో పర్యటించగా, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల కొల్లాపూర్‌లో ప్రచారం చేపట్టారు. ఇటీవల గద్వాలలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి రానున్నారు. శనివా రం కొల్లాపూర్‌లో, ఆదివారం మక్తల్‌ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 26న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మహబూబ్‌నగర్‌తో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు.

పాలమూరునుచుట్టేసిన సీఎం కేసీఆర్‌..
ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. షాద్‌నగర్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి పాలమూరును చూట్టేశారు. ఈ నెల 27న షాద్‌నగర్‌లో సభ జరగనుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మక్తల్‌లో రోడ్‌షో నిర్వహించగా.. పలువురు మంత్రలు అడపాదడపా జిల్లాలో పర్యటిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులకు ఈనెల 28 వరకే గడువు ఉంది. సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. మిగిలిన కాస్త సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఇంటి నుంచి బయలుదేరుతున్న అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యమైన నేతలు, కార్యకర్తలతో తదుపరి కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు. మిగిలిన నాలుగు రోజుల్లోనూ ప్రధాన పార్టీల సభలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
ఇవి చదవండి: త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ..

Advertisement

తప్పక చదవండి

Advertisement