ఓటర్ల నమోదుకు సహకరించండి | Sakshi
Sakshi News home page

ఓటర్ల నమోదుకు సహకరించండి

Published Fri, Dec 22 2023 1:18 AM

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సీతారామారావు  - Sakshi

నాగర్‌కర్నూల్‌: 2024 జనవరి ఒకటోతేదీ నాటికి 18ఏళ్లు పూర్తి చేసుకునే వారందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు కోరారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్‌హాల్‌లో గురువారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ ప్రకారం అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికలకు అవసరమైన చోట కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఒకచోట నుంచి మరో చోటుకు మార్చడం, అవసరంలేని చోట తొలగించడం వంటివి ఏమైనా ఉంటే ప్రతిపాదనలు పంపించాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌కు ఇది సువర్ణావకాశమని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న 3వేలకుపైగా దరఖాస్తుల అభ్యంతరాలను ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓల ద్వారా పరిష్కరించేలా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగింపుపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, నోటీసులు జారీచేసిన అనంతరం తొలగింపులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నుంచి వెంకటయ్య, కాంగ్రెస్‌ డేవిడ్‌రాజ్‌, బీజేపీ శ్రీనివాసులు, వైఎస్సార్‌టీపీ హుస్సేన్‌, టీడీపీ బాలకృష్ణ, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ జాకీర్‌ అలీ, డీటీ రఘు పాల్గొన్నారు.

ఈవీఎంల స్ట్రాంగ్‌రూం పరిశీలన

జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఈవీఎంల స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌ కేంద్రాలను అదనపు కలెక్టర్‌ సీతారామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌, వనపర్తి, గద్వాల, అలంపూర్‌లకు సంబంధించి స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ వెంట ఇన్‌చార్జి ఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి పత్యానాయక్‌, జిల్లా సివిల్‌సప్లై అధికారి స్వామికుమార్‌, డీఎం బాలరాజ్‌, మార్కెటింగ్‌ అధికారిణి బాలమణి తదితరులు ఉన్నారు.

అవసరమైన చోట పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలి

అదనపు కలెక్టర్‌ సీతారామారావు

Advertisement
Advertisement