అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Published Mon, Dec 25 2023 12:54 AM

- - Sakshi

కల్వకుర్తి రూరల్‌: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి మండలం గుండూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చేపట్టిన మనఊరు–మనబడి పనులను ఆదివారం పరిశీలించారు. అనంతరం వెటర్నరీ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించి, పనుల పురోగతిని తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టిన పల్లె దవాఖాన, పాలశీతలీకరణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కిష్టారెడ్డి, శ్రీనివాసరావు, వెంకటయ్య, లక్ష్మయ్య, కుమారస్వామి, రాజు పాల్గొన్నారు.

జాగ్రత్తలు పాటించాలి

కొల్లాపూర్‌: కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని కొల్లాపూర్‌ ఆర్టీసీ డీఎం ఉమాశంకర్‌ సూచించారు. ఆదివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ డ్యూటీలో ఉండే డ్రైవర్‌, కండక్టర్లు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. కరోనా బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ బాలసరస్వతి తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామి

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కొల్లాపూర్‌ రూరల్‌: కొల్లాపూర్‌ మండలం రామాపురం సమీపంలోని గుట్టపై వెలసిన అలివేలుమంగ సమేత లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతిపూజ, పుణ్యహవచనం, మాతృకాపూజ, మూలమంత్ర జపం, అభిషేకం, జలాధివాసం తదితర పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమవారం ధ్వజస్తంభం ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా దామోదర రాజనర్సింహ

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

సౌత్‌జోన్‌ పోటీలకుతరలిన అథ్లెటిక్స్‌ జట్టు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ పోటీలకు పీయూ అథ్లెటిక్స్‌ మహిళా జట్టు ఆదివారం తరలివెళ్లింది. ఈ మేరకు జట్టు సభ్యులకు పీయూ పీడీ శ్రీనివాస్‌ ట్రాక్‌సూట్‌లను అందజేశారు. భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం నుంచి జరగనున్న పోటీల్లో జట్టు పాల్గొననుంది. కార్యక్రమంలో కోచ్‌ రాధిక తదితరులు పాల్గొన్నారు.

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement