ప్రక్రియ షురూ.. | Sakshi
Sakshi News home page

ప్రక్రియ షురూ..

Published Thu, Apr 18 2024 9:35 AM

కలెక్టర్‌ కార్యాలయం  - Sakshi

నేటి నుంచి లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు

నామినేషన్ల స్వీకరణకు చివరి తేది

ఏప్రిల్‌ 25

ఉపసంహరణకు చివరి తేది

ఏప్రిల్‌ 29

పోలింగ్‌ తేది :

మే 13

ఎన్నికల ఫలితాలు: జూన్‌ 4

సాక్షి, నాగర్‌కర్నూల్‌: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్‌ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తమ అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్‌ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

బడా నేతలు హాజరు..

ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు హరీశ్‌రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్‌ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్‌ కార్యక్రమానికి గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌ హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు భారీ ర్యాలీలు, అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

ఖరారైన ప్రధాన పార్టీ అభ్యర్థుల ముహూర్తాలు

పార్టీల బడా నేతల హాజరు

ఈ నెల 25 వరకు స్వీకరణ

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

Advertisement
Advertisement