పంట పంటకీ.. డీలర్లకు తూకం తంటా..! | Sakshi
Sakshi News home page

పంట పంటకీ.. డీలర్లకు తూకం తంటా..!

Published Mon, Jul 17 2023 2:00 AM

- - Sakshi

నల్లగొండ: పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని గోదాముల వద్ద తూకం వేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీలర్లుకు ఎంఎల్‌ఎస్‌ (మండల్‌ లెవల్‌ స్టాక్‌) పాయింట్‌ వద్ద బియ్యం తూకం వేసి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చర్యలకు పూనుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలు లేకపోవడంతో డీలర్లు బయోమెట్రిక్‌ను గోదాముల్లో సేకరిస్తూ.. బియ్యం తూకం మాత్రం బయట వేబ్రిడ్డిల వద్ద వేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో 4,66,529 రేషన్‌ కార్డులు

జిల్లాలో మొత్తం 4,66,529 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 13,96,933 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఉచితంగా ప్రభుత్వం ఐదు కిలోల చొప్పన బియ్యం అందిస్తోంది. అయితే ప్రతినెల డీలర్లు కార్డుదారులకు బియ్యం తూకం వేసి ఇస్తున్నారు. కానీ డీలర్లకు బియ్యం సరఫరా చేసే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద మాత్రం తూకం వేయకుండా బస్తా 50 కేజీల చొప్పున లెక్కగట్టి పంపుతున్నారు. దీనివల్ల బియ్యం తక్కువగా వచ్చి తా ము నష్టపోతున్నామని డీలర్లు కోర్టును ఆశ్రయించడంతో డీలర్లకు బయోమెట్రిక్‌ విధానంలో బియ్యం తూకం వేసి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

ఆలస్యంగా బియ్యం పంపిణీ..

డీలర్లకు బయోమెట్రిక్‌ విధానంలో తూకం వేసి బియ్యం ఇవ్వాలని నిర్ణయించడంతో జూలై మాసానికి సంబంధించి ప్రజలకు బియ్యం పంపిణీని 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ బియ్యం సరఫరాలో ఆలస్యం కారణంగా 10వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించారు.

గ్రామీణ డీలర్లకు ఇబ్బందులు..

కోర్టు ఆదేశాల మేరకు జూలై మాసానికి సంబంధించిన బియ్యం తూకం వేసి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే, జిల్లాలోని ఆరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో డీలర్లు వేలిముద్రలు వేసి బియ్యం మాత్రం ప్రైవేట్‌ వేబ్రిడ్జిల మీద తూకం వేయించుకుంటున్నారు. పట్టణ ప్రాంతంలోని డీలర్లకు ఎక్కువ బియ్యం ఉండడం వల్ల వారికి ఒక లారీ బియ్యం తూకం వేసేందుకు వీలు అవుతుంది.

కానీ, గ్రామీణ ప్రాంతాల డీలర్లకు మాత్రం ఇద్దరు, ముగ్గురికి కలిపి ఒక లారీలో బియ్యం పంపిస్తారు. అలా ముగ్గురికి బయట వేబ్రిడ్జి మీద తూకం వేయడం సాధ్యం కావడం లేదు. దీంతో తూకం వేయకుండా పాత పద్ధతినే 50 కేజీల బస్తా చొప్పన లెక్కగట్టి ఇస్తున్నారని కొందరు డీలర్లు పేర్కొంటున్నారు. తూకం వేయకపోవడం వల్ల మళ్లీ తరుగు వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.

Advertisement
Advertisement