ప్రభుత్వ ఉద్యోగం రాలేదని.. యువకుడు తీవ్ర నిర్ణయం​..!

6 Sep, 2023 12:42 IST|Sakshi

నల్గొండ: ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెన్‌పహాడ్‌ మండలంలోని పొట్లపహాడ్‌ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్లపహాడ్‌ గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు మేకపోతుల సైదమ్మ, సీతారాములు దంపతుల పెద్ద కుమారుడు మేకపోతుల విక్రమ్‌(30) బీటెక్‌ చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు.

సోమవారం జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష రాసి వచ్చాడు. ఎన్ని పరీక్షలు రాసినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన విక్రమ్‌ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ మృతుడి వద్ద లభించింది.

కాగా విక్రమ్‌కు దామరచర్ల గ్రామానికి చెందిన యువతితో జూలైలో ఎంగేజ్‌మెంట్‌ కాగా నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే అతడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నర్సింగ్‌ వెంకన్నగౌడ్‌ తెలిపారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు