TS Special: హుషారులో ‘కారు’.. ఇంకా వికసించని కమలం,హస్తం పరిస్థితి కూడ అంతే..! | Sakshi
Sakshi News home page

TS Special: హుషారులో ‘కారు’.. ఇంకా వికసించని కమలం,హస్తం పరిస్థితి కూడ అంతే..!

Published Wed, Oct 25 2023 2:02 AM

- - Sakshi

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికలప్రచార వేడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ప్రచారంలో ముందుండగా.. కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థులు గ్రామాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక, బీజేపీ మాత్రం ఇంకా 8 చోట్ల అభ్యర్థుల ఎంపిక కసరత్తుపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

నల్లగొండ : నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం జోరు పెంచింది. ఇప్పటికే అభ్యర్థుఽలు ప్రచారంలోకి దిగగా.. సీఎం బహిరంగ సభలతో మరింత హోరెత్తనుంది. ఉమ్మడి జిల్లాలో కేసీఆర్‌ ఈ నెల 16న భువనగిరిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ఈ వారం రోజుల్లో సీఎం మూడు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. 26, 29, 31 తేదీల్లో ఏడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొనేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది.

26వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే విధంగా 29వ తేదీన మూడు నియోజక వర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కోదాడలో, 2 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలో, 3 గంటలకు ఆలేరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 31వ తేదీన కూడా ఉమ్మడి జిల్లాలో మూడు బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు.

హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండలో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. మొదటి విడత ప్రచారంలో కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఈ నెల 31వ తేదీ లోపే బహిరంగ సభలు ముగిస్తున్నారు. నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.

రెండో జాబితా కసరత్తులో కాంగ్రెస్‌..
కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించింది. నల్లగొండ, నకిరేకల్‌, ఆలేరు, కోదాడ, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోయే అభ్యర్థులను ఫైనల్‌ చేసింది. ఇక రెండో జాబితాలో.. అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది.

అయితే, బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఎలక్షన్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జిల్లాలోని మిగతా ఆరు నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.


బీజేపీలో తప్పని ఎదురుచూపులు..
బీజేపీలో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల ప్రచార జోరు పెంచగా.. బీజేపీ మాత్రం ఇంకా వేగం పెంచలేదు. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు నాలుగు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ప్రచారం కూడా పెద్దగా చేయని పరిస్థితి నెలకొంది.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులకు ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. అధిష్టానం మిగిలిన స్థానాలకు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తుందో, ఎప్పుడు ప్రచారం చేసుకోవాలో అర్థం కావడం లేదని ఆశావహులు అంటున్నారు.

Advertisement
Advertisement