సరికొత్తగా ఈవీఎంలు | Sakshi
Sakshi News home page

సరికొత్తగా ఈవీఎంలు

Published Tue, Nov 14 2023 1:52 AM

- - Sakshi

కోదాడ, నల్లగొండ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్‌ విధానంలో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌(ఈవీఎం)లను వాడుతున్నారు. ఆ తర్వాత ఈవీఎంలకు అనుబంధంగా ఓటర్‌ వెరిఫియబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌(వీవీ ప్యాట్‌) యంత్రాలను జోడించారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థికి కేటాయించిన గుర్తుతో పాటు సదరు అభ్యర్థి ఫొటోలను కూడా ఉంచనున్నారు.

తొలిసారిగా 1982లో..

ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలను ముద్రించడం, భద్రపర్చడం ఖర్చు, శ్రమతో కూడుకున్న వ్యవహారం కావడంతో వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను ఉపయోగించాలనే ఆలోచన 1979లో చేశారు. తొలుత వీటిని ఐఐటీ బాంబే, ఇండ్రస్ట్ట్రీయల్‌ డిజైన్‌ సెంటర్‌ వారు సంయుక్తంగా తయారు చేశారు. వీటిని తొలిసారిగా కేరళలో 1982 అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్‌ పరవూర్‌ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ప్రయోగాత్మకంగా వినియోగించారు. మంచి ఫలితాలు రావడంతో వీటి తయారీని ప్రభుత్వరంగ సంస్థలైన ఈసీఐఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ సంస్థలకు అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌, బెంగళూరులోని బీహెచ్‌ఈఎల్‌ కంపెనీలు దేశం మొత్తానికి అవసరమైన ఈవీఎంలను తయారు చేస్తున్నాయి.

64 మంది వరకు ఉపయోగించవచ్చు..

ఒక్కో ఈవీఎంలో బ్యాలెట్‌ యూనిట్‌పై 16మంది అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను ఏర్పాటు చేయవచ్చు. ఇలా నాలుగు ఈవీఎంలను ఒక కంట్రోల్‌ యూనిట్‌కు అనుసంధానించవచ్చు. అంటే ఒక కంట్రోల్‌ యూనిట్‌కు 64 గుర్తుల వరకు మాత్రమే అమర్చడానికి వీలవుతుంది. అంతకుమించి అభ్యర్థులు పోటీ పడితే అక్కడ బ్యాలెట్‌ పేపర్‌ వాడాల్సి ఉంటుంది. ఒక్క ఈవీఎంలో గరిష్టంగా 3840 ఓట్ల వరకు నమోదవుతాయి. ఓటరు తాను వేసిన ఓటును ఓటింగ్‌ యంత్రంపై 7 సెకన్ల పాటు చూసుకోవచ్చు. కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన ఓటు 10 సంవత్సరాల వరకు భద్రంగా ఉంటుంది.

అభ్యర్థి ఫొటోలు కూడా..

ఇప్పటివరకు ఈవీఎంలలో బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లు కలిపి ఉంటాయి. బ్యాలెట్‌ యూనిట్‌పై గతంలో అభ్యర్థి పేరు, అతనికి కేటాయించిన గుర్తు మాత్రమే ఉండేవి. ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్‌ యూనిట్‌పై అభ్యర్థి ఫొటోను కూడా ఉంచనున్నారు. దీంతో ఓటరు గుర్తు విషయంలో ఇబ్బంది పడితే అభ్యర్థి ఫొటో చూసి తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవచ్చు.

ఫ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లపై ఆయా పార్టీల గుర్తులతో పాటు అభ్యర్థి ఫొటో

2004 నుంచి దేశవ్యాప్తంగా..

1999, 2001లలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను ఎన్నికల సంఘం ఉపయోగించింది. 2004 నుంచి జరిగిన అన్ని పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను వందశాతం వినియోగిస్తూ వస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై దేశంలోని పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈవీఎంలకు అనుబంధంగా వీవీ ప్యాట్‌లను తీసుకొచ్చారు. ఓటరు ఈవీఎంపై వేసిన ఓటు స్లిప్‌ రూపంలో వీవీ ప్యాట్‌ బాక్స్‌లలో పడుతుంది. ఒకవేళ కౌంటింగ్‌ సమయంలో ఈవీంఎ ఓపెన్‌ కాకపోయినా, రీకౌంటింగ్‌ కావాలని ఎవరైనా అభ్యర్థి అడిగితే వీవీ ప్యాట్‌లో ఉన్న స్లిప్పులను లెక్కిస్తారు.

Advertisement
Advertisement