తుంగతుర్తి.. మూడు జిల్లాల్లో | Sakshi
Sakshi News home page

తుంగతుర్తి.. మూడు జిల్లాల్లో

Published Tue, Nov 14 2023 1:52 AM

- - Sakshi

తిరుమలగిరి (తుంగతుర్తి) : తెలంగాణ సాయుధ పోరాటం పేరు వినగానే తుంగతుర్తి గుర్తుకొస్తుంది. నిజాం నిరాంకుశ పాలనకు భూస్వామ్య పెత్తందారి బానిస విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. పోరాట యోధులైన భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, మారోజు వీరన్న లాంటి వీరులు ప్రాంతం వారే. బండెనక బండి.. పదహారు బండ్లు కటి.. ఏ ఏ బండ్లో పోతవ్‌ కొడుకో నైజాం సర్కారోడా అన్న పాటతో ప్రజల్లో చైతన్యం రగిలించిన బండి యాదగిరిది కూడా ఈ ప్రాంతమే. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారిది కూడా ఇదే నియోజకవర్గం. ఆ స్ఫూరిత్తో ఈ ప్రాంతం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా నిలుస్తోంది. ఎంతో చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం జిల్లా పునర్విభజనతో మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది.

1967లో నియోజకవర్గంగా..

తుంగతుర్తి మొదటగా 1952లో సూర్యాపేట ద్విసభ నియోజకవర్గంలో ఉండేది. 1962లో నాగారం నియోజకవర్గంగా, 1967లో తుంగతుర్తి నియోజకవర్గంగా ఏర్పడింది. మొదటగా నియోజకవర్గంలో తుంగతుర్తి, తిరుమలగిరి, నూతనకల్‌, అర్వపల్లి, ఆత్మకూరు(ఎస్‌) మండలంలోని 11 గ్రామాలు ఉండేవి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త మండలాలు వచ్చి చేరాయి. 2016లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజనతో తుంగతుర్తి, తిరుమలగిరి, నూతనకల్‌, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, నాగారం మండలాలు సూర్యాపేట జిల్లా పరిధిలోకి, అడ్డగూడూరు, మోత్కూరు మండలాలు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి, శాలిగౌరారం మండలం నల్లగొండ జిల్లా పరిధిలోకి వెళ్లింది.

12 సార్లు ఎన్నికలు..

తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాల్లో 2,49,556 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ నాలుగుసార్లు (1962, 1985, 1989, 2004) సీపీఎం మూడుసార్లు (1967, 1978, 1983), టీడీపీ (1999, 2009) రెండుసార్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు (1972, 1994) రెండుసార్లు విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ (2014, 2018) రెండుసార్లు విజయం సాధించింది.

Advertisement
Advertisement