బీఆర్‌ఎస్‌ను ఓడించాలి | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను ఓడించాలి

Published Sun, Nov 19 2023 2:02 AM

నల్లగొండలోని మేకల అభినవ్‌ స్టేడియంలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరైన జనం   - Sakshi

నల్లగొండకు ద్రోహం చేసిన కేసీఆర్‌ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తేనే అభివృద్ధి

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండ జిల్లా అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అభివృద్ధిని విస్మరించిన బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కోరారు. ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లెంల, శివన్నగూడెం ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నల్లగొండ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ అంటేనే అవినీతి, లంచగొండి పార్టీ అని ఘాటుగా విమర్శలు చేశారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్‌షా మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి కేంద్రం రూ.400 కోట్లు ఇచ్చిందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దళిత బంధు ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన చోట బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు కమీషన్లు తీసుకున్నారని దుయ్యబట్టారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలో రూ.కోట్ల్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. జిల్లాలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారా అని అమిత్‌ షా ప్రశ్నించగా గెలిపిస్తామని ప్రజలు చేతులెత్తి నినదించారు.

నల్లగొండ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తాం

బీజేపీ నల్లగొండ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. నల్లగొండ నుంచి స్థానికేతరులను తరిమితేనే నల్లగొండ అభివృద్ధి సాధ్యమని, గత నాలుగు దశాబ్దాలుగా పక్క నియోజకవర్గానికి చెందిన కాంట్రాక్టర్లు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయి నల్లగొండ అభివృద్ధిని విస్మరించారని తెలిపారు. నల్లగొండలో భూపాల్‌రెడ్డి హయాంలో భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు పెరిగిపోయాయన్నారు. నాగార్జునసాగర్‌ అభ్యర్థి కంకణాల నివేదితరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు.

బీజేపీకి పట్టం కట్టాలి

మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఓడించి బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలో బీజేపీ అభ్యర్థుల గెలుపుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని నకిరేకల్‌ నియోజకవర్గ అభ్యర్థి మొగులయ్య అన్నారు. అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ అభ్యర్థులకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ది చేసి చూపిస్తామని దేవరకొండ అభ్యర్ధి లాలునాయక్‌ అన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా అవినీతి రహిత పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని పార్టీ మిర్యాలగూడ అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు అన్నారు. కాగా, అమిత్‌ షా ప్రసంగాన్ని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలుగులో అనువదించారు. ఈ సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సీనియర్‌ నేతలు చింత సాంబమూర్తి, గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్‌, కన్మంతరెడ్డి శ్రీదేవి, బండారు ప్రసాద్‌, నాయకులు ప్రదీప్‌కుమార్‌, పోతెపాక సాంబయ్య, బాబా, పెరిక మునికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివాదం చేస్తున్న అమిత్‌షా

ఫ బ్రాహ్మణవెల్లెంల, శివన్నగూడెం ప్రాజెక్టులను విస్మరించారు

ఫ నల్లగొండ అభివృద్ధికి కేంద్రం రూ.400 కోట్లు ఇచ్చింది

ఫ బీఆర్‌ఎస్‌ అంటేనే అవినీతి, లంచగొండి పార్టీ

ఫ సకలజనుల విజయ సంకల్ప సభలో

కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షా

1/2

2/2

Advertisement
Advertisement