బీఆర్‌ఎస్‌ గెలవాలి | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ గెలవాలి

Published Wed, Nov 22 2023 1:34 AM

ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలు
 - Sakshi

మరింత అభివృద్ధి, సంక్షేమం అమలు కావాలంటే..

ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంతటి అభివృద్ధి ఎప్పుడైనా జరిగిందా..

ఫ రూ.30 వేల కోట్ల విద్యుత్‌ ప్రాజెక్టు తీసుకొచ్చాం

ఫ కాంగ్రెస్‌ హయాంలో మూసీ మురికినీరు, ఫ్లోరిన్‌ నీరే గతి

ఫ మేము మిషన్‌ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నాం

ఫ హరితహారం, పల్లెప్రకృతి వనాలతో గ్రామాల రూపురేఖలు మార్చాం

ఫ సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

సూర్యాపేట : దశాబ్దాల కాలం సూర్యాపేట ప్రజలకు హైదరాబాద్‌ మూసీ నీరు తాగించిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్‌ అని, మునుగోడు దేవరకొండలో ఫ్లోరిన్‌ నీటితో లక్షా 50 వేల మంది ప్రజల ఉసురు పోసుకుంది కాంగ్రెస్‌ అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్‌ మరమ్మతులు చేయకుండా నాశనం చేసిన ఘనులు కాంగ్రెస్‌ నాయకులన్నారు. తాము మూసీ గేట్ల మరమ్మతు చేయించి రైతులకు సాగునీరు అందించగలిగామని చెప్పారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జగదీష్‌రెడ్డి చేసిన అభివృద్ధి నల్లగొండ జిల్లాలో గతంలో ఏ మంత్రి అయినా చేసిండా? అని ప్రశ్నించారు. పట్టుబట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రూ.30 వేల కోట్ల విద్యుత్‌ ప్రాజెక్టు తీసుకొచ్చారని, దీంతో వేలాది మందికి ఉపాధి లభించనుందన్నారు. గ్రామాలలో హరితహారం, పల్లె ప్రకృతి వనాలతో సస్యశ్యామలంగా మార్చుకున్నామని, చెత్త సేకరణకు ట్రాక్టర్‌లను అందించామని తెలిపారు. సీసీరోడ్ల నిర్మాణంతో పల్లె రూపురేఖలు మారాయని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో సద్దల చెరువు, పుల్లారెడ్డి చెరువులపై మినీట్యాంక్‌ బండ్‌లు ఏర్పాటు చేశామని, సమీకృత మార్కెట్‌ను దేశానికి రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దామని తెలిపారు. దరిద్రపు కాంగ్రెస్‌ను కాలువలో తొక్కాలని, సూర్యాపేట మరింత అభివృద్ధి జరగాలంటే జగదీష్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జగదీష్‌రెడ్డిని గెలిపిస్తే మరోసారి ఉన్నత స్థానంలోనే ఉంటాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సూర్యాపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగేంధర్‌రావు, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, మధుసూదనాచారి, నాయకులు చెరుకు సుధాకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, శంకరమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌, ఒంటెద్దు నరసింహారెడ్డి, నంద్యాల దయాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటను కోనసీమగా మార్చిన

ఘనత కేసీఆర్‌దే : జగదీష్‌రెడ్డి

కరువు నేల అయిన సూర్యాపేటను కాళేశ్వరం జలాలతో కోనసీమగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని, గోదావరి జలాలను అందించి బీడుభూములను సస్యశ్యామలం చేశారని సూర్యాపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని చెప్పారు. సూర్యాపేటను జిల్లా చేశారని, మెడికల్‌ కళాశాల ఇచ్చారని వివరించారు. మూసీ మురికినీళ్ల నుంచి విముక్తి కల్పించి మిషన్‌ భగీరథ నీళ్లిచ్చారని చెప్పారు. రూ.7,500 కోట్లతో 9 ఏళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ పఽథకాలను అందించి ప్రోత్సహించారని తెలిపారు.

డ్రైపోర్టు, ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఇవ్వాలని వినతి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యువతకు ఉపాధి అఽవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌ – విజయవాడ మధ్యలో ఉన్న సూర్యాపేటలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో ఐటీ హబ్‌ ఏర్పాటు చేసినందున ఐటీ టవర్ల నిర్మాణం చేపట్టి విస్తరించాలన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఉండ్రుగొండ, పిల్లలమర్రి, ఫణిగిరి, మూసీలను కలుపుతూ టూరిస్ట్‌ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

దండిగా కదిలొచ్చిన జనం

సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ జనజాతరను తలపించింది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు, రెపరెపలాడుతున్న జెండాలతో విజయవాడ–హైదరాబాద్‌ హైవే గులాబీ వనమైంది. సభ సాయంత్రం 5గంటలకు ఉండగా 12గంటల నుంచే జనం భారీగా వచ్చి చేరడంతో సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. కులవృత్తుల వేషధారణలు, గిరిజన లంబాడీ మహిళల నృత్యాలు, గొల్లకుర్మల డిల్లెం బల్లెం.. ఇలా సబ్బండ వర్గాల ప్రజలు సమూహాలుగా నృత్యాలు చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ‘ఇది ఎర్రజెండా గడ్డ, కమ్యూనిస్టుల అడ్డ.. భీంరెడ్డి నర్సింహారెడ్డి లాంటి వ్యక్తులు పోరాడిన ఈ ప్రాంతంలో డబ్బుల కట్టల మదంతో కొట్టుకుంటున్న కాంగ్రేసోళ్ల అరాచకాలు సాగవు’ అని కేసీఆర్‌ చెప్పినప్పుడు జనం కేరింతలు కొట్టారు. బహిరంగ సభకు ఊహించిన దానికంటే ఎక్కువ జనం రావడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1/4

సభలో గోరటి వెంకన్న ఆటాపాట
2/4

సభలో గోరటి వెంకన్న ఆటాపాట

3/4

మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి
4/4

మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement