పత్తి సాగుపై రైతులకు అవగాహన | Sakshi
Sakshi News home page

పత్తి సాగుపై రైతులకు అవగాహన

Published Sun, Dec 3 2023 1:30 AM

వర్ధమానుకోటలో రైతులకు అవగాహన కల్పిస్తున్న కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త ఆదర్శ - Sakshi

నాగారం: మండల పరిధిలోని వర్ధమానుకోట గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో శనివారం పత్తి పంటలో అధిక సాంద్రత పద్ధతి సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త డి. ఆదర్శ మాట్లాడుతూ.. పత్తి పంటలో అధిక సాంద్రత పద్ధతి సాగు అవలంబించడం ద్వారా రైతులు అధిక దిగుబడి పొందవచ్చని అన్నారు. ఈ సాగును అవలంబించడం ద్వారా విత్తనాలు, మొక్క శాఖీయ పెరుగుదలను నివారించడానికి వాడే మెపిక్వాటుక్లోరైడ్‌, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అయ్యే ఖర్చు ఒక ఎకరానికి రూ.6,000 వరకు జాతీయ ఆహార భద్రత మిషన్‌ నుంచి నేరుగా రైతు ఖాతాలోకి వస్తాయని తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో చీడపీడల యాజమాన్యం గురించి, సస్యరక్షణ చర్యలైన లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు (నీలం, పసుపు, తెలుపు రంగులు) వాటిని వాడుకునే విధానం గురించి రైతులకు అవగాహన కల్పించారు. పత్తి సాగులో చేపట్టాల్సిన మెలకువలు, ఎరువుల యాజమాన్యం, మొక్క ఎదుగుదల నియంత్రికాలైన మెపిక్వాటు క్లోరైడ్‌ (చమత్కార్‌) దాని ఉపయోగాలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో కేవీకే ఇన్‌చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డి. నరేష్‌, రాశి సీడ్స్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ టి. నరేష్‌, కృషి విజ్ఞాన కేంద్రం యంగ్‌ ప్రొఫెషినల్స్‌ విక్రమ్‌, సంతోష్‌, మౌనిక, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement