కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఏకకాలంలో అసెంబ్లీకి.. | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలిచింది ఈ ఎన్నికల్లోనే..

Published Mon, Dec 4 2023 2:58 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాఽధించిన సమయంలో వెంకట్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీచేసి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ సమయంలో వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు.

2018 ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓడిపోగా.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2022లో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ఉపఎన్నిలో ఓడిపోయారు. ఈ ఎన్నికలకు ముందు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి గెలుపొందగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరు సోదరులు ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉత్తమ్‌
హుజూర్‌నగర్‌: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో కోదాడ ఎమ్మెల్యేగా రెండు సార్లు, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం 6వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడు సార్లు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే మళ్లీ హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

Advertisement
Advertisement