ఆర్డీఆర్‌కు మళ్లీ అపజయమే.. | Sakshi
Sakshi News home page

ఆర్డీఆర్‌కు మళ్లీ అపజయమే..

Published Tue, Dec 5 2023 4:54 AM

- - Sakshi

సూర్యాపేట: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి సూర్యాపేట కలిసి రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా హస్తం హవా కొనసాగిన తరుణంలో సూర్యాపేటలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తుంగతుర్తిలో 1985 నుంచి వరుసగా మూడుసార్లు.. 2004లో మరోసారి.. ఇలా మొత్తం నాలుగు పర్యాయాలు విజయం సాధించిన దామోదర్‌రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది. రాష్ట్ర మంత్రిగా కూడా రెండుసార్లు పనిచేశారు. తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్‌, సూర్యాపేట జనరల్‌ స్థానం అయ్యింది. దీంతో 2009 లో సూర్యాపేట నుంచి మొట్టమొదటిసారి పోటీ చేసి విజయబావుటా ఎగరవేశారు. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు అపజయం పాలయ్యారు. మూడుసార్లు విజయానికి చేరువగా వచ్చి ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. మరీ ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుండడం.. గెలిస్తే మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఆర్డీఆర్‌ ఓడిపోవడంతో ఢీలా పడ్డట్లయింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖపోటీ ఉండి బీజేపీ అభ్యర్థులు బలంగా ఓట్లు చీల్చుకున్న దగ్గర కాంగ్రెస్‌ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది.. ఇక్కడ కూడా అదే జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఈసారి ఓటర్లను సరిగా అంచనా వేయలేకపోవడంతో ఓటమిని చవిచూసినట్లు చర్చించుకుంటున్నారు.

ఫ సూర్యాపేటలో వరుసగా

మూడు సార్లు ఓటమి

ఫ 2009లో ఒక్కసారి మాత్రమే గెలుపు

ఫ కాంగ్రెస్‌ ‘వేవ్‌’లోనూ దక్కని విజయం

Advertisement
Advertisement