ఉనికి చాటుకోని కామ్రేడ్లు | Sakshi
Sakshi News home page

ఉనికి చాటుకోని కామ్రేడ్లు

Published Tue, Dec 5 2023 4:54 AM

-

1994లో సీపీఐ, సీపీఎం చెరో మూడు స్థానాల్లో గెలుపు

నేడు డిపాజిట్‌ కూడా దక్కించుకోని సీపీఎం అభ్యర్థులు

నల్లగొండ టౌన్‌: విప్లవాల ఖిలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేడు కామ్రేడ్లు తమ ఉనికిని చాటుకోలేకపోయారు. జిల్లాలోని 12 స్థానాలకు గాను సీపీఎం 7 స్థానాల్లో పోటీ చేయగా ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో వారికి కనీసం డిపాజిట్‌ దక్కలేదు. సీపీఐ మాత్రం ఎక్కడా పోటీ చేయకుండా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపింది. అయితే 1994లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీపీఎం 3, సీపీఐ 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచాయి. 2004 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ చెరో 2 స్థానాలను కై వసం చేసుకున్నాయి. 2009 ఎన్నికల్లో సీపీఐ మునుగోడులో, సీపీఎం మిర్యాలగూడలో గెలిచాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ దేవరకొండలో గెలవగా, సీపీఎం ఒక్క స్థానం కూడా గెలవలేదు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి సీపీఎం సీనియర్‌ నేత జూలకంటి రంగారెడ్డి బరిలో నిలవగా 3,234 ఓట్లు వచ్చాయి. నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డికి కేవలం 1,439 ఓట్లు వచ్చాయి. నకిరేకల్‌ నుంచి బరిలో నిలిచిన బొజ్జ చిన వెంకులుకు 3,238 ఓట్లు, భువనగిరి నుంచి పోటీలో ఉన్న కొండమడుగు నర్సింహకు 1,303 ఓట్లు వచ్చాయి. ఇక, హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేసిన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మికి 1,914 ఓట్లు వచ్చాయి. మునుగోడు నుంచి దోనూరి నర్సిరెడ్డికి 2,351, కోదాడ బరిలో నిలిచిన మట్టపల్లి సైదులుకు 1,187 ఓట్లు వచ్చాయి. దీంతో సీపీఎం అభ్యర్థులకు ఎక్కడ కూడా డిపాజిట్‌ దక్కని పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement