మిరప కోతలో జాగ్రత్తలు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

మిరప కోతలో జాగ్రత్తలు తప్పనిసరి

Published Tue, Dec 5 2023 4:54 AM

మిరప కాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు - Sakshi

కోత విధానం ఇలా..

మిరపతోటలో కొన్ని కాయలు పండిన వెంటనే కూలీలతో కోయిస్తే చెట్టు విరిగిపోయి తోటకు నష్టం కలుగుతుందని చాలామంది రైతులు భావిస్తున్నారు. చాలా కాయలు పండిన తర్వాత ఒకేసారి కోయవచ్చునని మరికొంత మంది రైతులు భావించి పంట కోతను ఆలస్యం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు కురిస్తే పండిన కాయలు చెట్టు నుంచి మొత్తం రాలిపోతాయి. మంచు వల్ల కూడా కాయలు రాలిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి తెల్లకాయలు ఎక్కువగా వస్తుంటాయి. మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. అందువల్ల రైతులు తోటలో కోతకు వచ్చిన కాయల్ని విడతల వారీగా కోసి నాణ్యత గల కాయల్ని మార్కెట్‌కు పంపాలి. పండిన కాయల్ని వెంటనే కోస్తే తెల్లకాయలు ఎక్కువగా రావు. కాయకోత తరువాత ఎరువులు వేసి, నీటి తడి పెడితే అదనంగా మొక్కకు కాయ వచ్చి దిగుబడి పెరుగుతుంది. రైతులు కనీసం కాయలను ఆరు, ఏడు దఫాలుగా కోయాలి.

పెద్దవూర: మిరప పంటను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా సాగు చేస్తున్నారు. మిరప పంట ఇప్పుడిప్పుడే పండుగా మారుతుండటంతో రైతులు మిరపకాయలను కోసేందుకు సిద్ధమవుతున్నారు. మిరప కోత, ఆరబెట్టే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి కె. సందీప్‌కుమార్‌ తెలిపారు. మిరప కోత, ఆరబెట్టే సమంయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..

పంట మార్పిడి చేయాలి..

మిరప రైతులు ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నా నాణ్యత లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన సమయంలో కోతలు కోయక, కల్లాల్లో వర్షానికి, మంచుకు కాయలు తడిస్తే నాణ్యత తగ్గుతుంది. మార్కెట్లో ధరలు లేక ఎగుమతులకు పనికిరాక, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం వంటి కారణాలతో రైతులు నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయకపోవడం, విచక్షణారహితంగా పురుగు మందులను పిచికారీ చేయడం, పండిన మిరపకాయలు ఎప్పటికప్పుడు తెంచకపోవడం వంటి కారణాలతో కాయ నాణ్యత లోపిస్తుంది.

ఆరబెట్టడం ఇలా..

కొన్నిసార్లు కోతల సమయంలో వర్షాలు కురిస్తే సకాలంలో కోతలు జరగక కోసిన వాటిని సరైన సమయంలో ఎండబెట్టక పోవడంతో నాణ్యత లేని మిర్చిగా మారిపోతుంది. ఫలితంగా మార్కెట్లో కాయలకు సరైన ధర రాక నష్టపోవాల్సి వస్తుంది. మిరపకాయల్ని ఎండబెట్టే కల్లాల్ని గట్టి భూమి ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. దుమ్ము ఎక్కువగా లేని, కొద్దిగా ఏటవాలుగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నీళ్లు వెళ్లే వైపు కల్లం పొడవుగా ఉండాలి. వర్షం పడినప్పుడు పైనీళ్లు కల్లం పైకి రాకుండా కల్లం చుట్టూ అడుగున్నర ఎత్తు కట్ట ఏర్పాటు చేసుకోవాలి. తోట విస్తీర్ణం, దిగుబడిని బట్టి కల్లం పొడవు, వెడల్పులను తయారు చేసుకోవాలి. వర్షాలు పడ్డప్పుడు పరదాలు కప్పుతాం కాబట్టి నీరు తీసివేయడానికి అనుకూలంగా ఉంటుంది. దాదాపు 10 క్వింటాళ్ల మిరపకు 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు గల కల్లం తయారు చేసుకోవాలి. కల్లం సైజును బట్టి టార్ఫాలిన్‌ కవరు తెచ్చుకోవాలి. ప్రతిరోజు కోసే కాయల్ని కుప్పలుగా పోసి మరుసటి రోజు ఉదయం మంచు తగ్గగానే పలుచగా పోసి ఆరబెట్టాలి. ప్రతిరోజు సాయంత్రం ఆరబెట్టిన మిరప కాయల్ని కుప్పగా పోసి టార్ఫాలిన్‌ కవర్‌ కప్పి కాయలపై మంచు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేస్తే గాలి, వెలుతురు బాగా ప్రసరించి కాయలు త్వరగా ఎండుతాయి. కాయలు బాగా ఎండకముందే తెల్లకాయలు వేరుచేయాలి. కాయల్లో 5 శాతం తేమ ఉన్నప్పుడే వాటిని ఎండ పోసి గోనె సంచులతో కప్పాలి. మార్కెట్‌కు తీసుకెళ్లే రోజు ఉదయం శుభ్రమైన ఖాళీ సంచుల్లో వాటిని నింపాలి. ఒక్కో సంచిలో 40 కిలోల కాయల కన్నా ఎక్కువ నింపకూడదు. ఎక్కువ కాయల్ని సంచిలో తొక్కితే కాయ నాణ్యత చెడిపోయి మార్కెట్‌లో సరైన ధర రాదు. కోత సమయంలో ఈ విధమైన చర్యలు చేపడితే నాణ్యమైన పంటతో పాటు మార్కెట్లో అధిక ధర పలుకుతుంది.

ఫ పెద్దవూర ఏఓ కె. సందీప్‌కుమార్‌

పాడి పంట
1/1

పాడి పంట

Advertisement
Advertisement