మందకొడిగా యాసంగి సాగు | Sakshi
Sakshi News home page

మందకొడిగా యాసంగి సాగు

Published Fri, Dec 8 2023 7:24 AM

- - Sakshi

నల్లగొండ అగ్రికల్చర్‌ : యాసంగి సీజన్‌ పంటల సాగు జిల్లాలో మందకొడిగా సాగుతోంది. సీజన్‌ ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 9,880 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలను రైతులు సాగు చేశారు. గత యాసంగి సీజన్‌లో ఈ పాటికే సుమారు 95 వేల ఎకరాలలో వరితో పాటు ఇతర పంటలు వేశారు. ఈ యాసంగిలో సుమారు 5.81 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగువుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో వరి 5 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 20 వేలు, పెసర 1,000, మినుము 200 ఎకరాల్లో సాగువుతాయని పేర్కొంది. కానీ, అధికారుల అంచనాలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. కేవలం 9,880 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. లక్ష ఎకరాలకు సరిపడా వరి నారును పోసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఎన్నికల ఎఫెక్టా..!

మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉంది. యాసంగి సీజన్‌ మొదలైన నాటి నుంచి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాల మొతమోగాయి. రైతులు కూడా ఆయా పార్టీలు పెట్టిన ఎన్నికల సభలు, ప్రచారాల్లో పాల్గొన్నారు. దీంతో యాసంగి సాగు ఊపందుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల జాతర ముగిసిన నేపథ్యంలో రైతులు యాసంగి సాగుపై దృష్టి సారించి వరినార్లు పోసుకునే పనిలో నిమగ్నమయ్యారు. డిసెంబర్‌ చివరి వరకు వరినాట్లు వేసుకునేందుకు అవకాశం ఉన్నందున ఇప్పుడిప్పుడే నార్లు పోసుకుంటున్నారు.

ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకమే..

నాగార్జునసాగర్‌ ఎడమకాలువ పరిధిలో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్‌సోరేజీకి చేరుకోవడంతో వానాకాలంలో కూడా సాగునీటిని విడుదల చేయడం లేదు. కేవలం తాగునీటి అవసరాల కోసమే విడుదల చేస్తున్నారు. వానాకాలంలోనే ఆయకట్టులో సుమారు 60 వేల ఎకరాల్లో ఎలాంటి పంటలను సాగు చేయలేదు. కేవలం బోర్లు, బావుల కింద మాత్రమే వరి సాగు చేశారు. ప్రస్తుతం యాసంగిలో కూడా బోర్ల కింద మాత్రమే పంటలు సాగయ్యేఅవకాశం ఉంది.

సీజన్‌ ఆరంభమై నెల రోజులైనా 9,880 ఎకరాల్లోనే పంటలు

ఇప్పుడిప్పుడే వరి నార్లు

పోసుకుంటున్న రైతులు

ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకమే

ఇప్పటి వరకు సాగైన పంటలు ఇలా..

పంట ఎకరాల్లో

వరి 2,046

వేరుశనగ 7,641

జొన్న 62

ఆముదం 40

మినుము 13

బొబ్బెర 19

పెసర 38

ఉలువలు 11

ఇతరములు 10

మొత్తం 9,880

నెలాఖరు వరకు నాట్లు వేసుకోవచ్చు

యాసంగి సీజన్‌లో డిసెంబర్‌ చివరి నాటికి వరినాట్లు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో యాసంగి సీజన్‌ పంటలు సాగు కాలేదు. ఆయకట్టు పరిధిలో ఈసారి కూడా నాట్లు వేసుకునేందుకు అవకాశం లేదు. బోర్ల కింద మాత్రమే రైతులు నార్లు పోసుకుంటున్నారు.

– పాల్వాయి శ్రవణ్‌కుమార్‌, డీఏఓ

1/1

Advertisement
Advertisement