రాష్ట్రపతి పర్యటనకు సిద్ధమవుతున్న పోచంపల్లి | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పర్యటనకు సిద్ధమవుతున్న పోచంపల్లి

Published Fri, Dec 8 2023 7:24 AM

- - Sakshi

భూదాన్‌పోచంపల్లి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 20న భూదాన్‌పోచంపల్లికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ రీజినల్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఫర్‌ హ్యాండ్లూమ్స్‌ అరుణ్‌కుమార్‌, చేనేత, జౌళిశాఖ ఏడీ విద్యాసాగర్‌ పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్‌కు రాష్ట్రపతి వస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే భూదాన్‌పోచంపల్లిలో 20వ తేదీన ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారని, పద్మశ్రీ, సంత్‌కబీర్‌, జాతీయ అవార్డు గ్రహీతలతో కూడా మాట్లాడుతారని చెప్పారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించామని, అందులో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారని వెల్లడించారు.

థీమ్‌ పెవిలియన్‌ ఏర్పాటు

తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే విధంగా థీమ్‌ ఫెవిలియన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ముఖ్యగా పోచంపల్లి ఇక్కత్‌, పుట్టపాక తేలియా రుమాళ్లు, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరల ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు చేనేత మగ్గాల ప్రదర్శన ఉంటుందని అరుణ్‌కుమార్‌ తెలిపారు. అనంతరం చేనేత సహకార సంఘం, గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని వారు సందర్శించారు.

Advertisement
Advertisement