రహదారులకు మహర్దశ! | Sakshi
Sakshi News home page

రహదారులకు మహర్దశ!

Published Mon, Dec 11 2023 9:40 AM

అధ్వానంగా ఉన్న ముశంపల్లి–ధర్మాపురం రోడ్డు - Sakshi

నల్లగొండ రూరల్‌: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే నల్లగొండ నుంచి ముశంపల్లి– ధర్మాపురం వెళ్లే 18 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించేందుకు తొలి ఫైల్‌పై సంతకం చేశారు. వారం రోజుల్లోగా టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర రోడ్లు అభివృద్ధికి నోచుకోనుండడంతో ఇంతకాలం నరకయాతన అనుభవించిన జిల్లా ప్రజలు, వాహనదారులకు ఊరట లభించనుంది.

నాలుగు లేన్లుగా విస్తరణ..

ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న నల్లగొండ–ముశంపల్లి–ధర్మాపురం రోడ్డు దశాబ్ద కాలంగా మరమ్మతులకు నోచుకోక అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. ఈ రోడ్డు మీదుగా జిల్లా కేంద్రానికి వచ్చే నిడమనూరు, కనగల్‌, నల్లగొండ, మాడ్గులపల్లి మండలాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు ప్రతిరోజూ నానా ఇబ్బందులు పడేవారు. మార్కెట్‌కు ధాన్యం తరలించాలన్నా రైతులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యేవారు. ఈ విషయాన్ని ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో గుర్తించిన కోమటిరెడ్డి ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తేరించేందుకు పూనుకున్నారు. నల్లగొండ– ముశంపల్లి– ధర్మాపురం రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించడం ద్వారా మొత్తంగా 50 గ్రామాల ప్రజలకు గుంతల ఇక్కట్లు తొలగనున్నాయి. దీంతో సాగర్‌, నల్లగొండ నియోజకవర్గాల ప్రజలకు, ఇక్కడి రైతులు పండించిన పంట ఉత్పత్తులను హైదరాబాద్‌కు తరలించేందుకు రవాణా సులువు కానుంది.

మూడు జిల్లాల్లో ఇలా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3,621.391 కిలోమీటర్ల పొడవునా రోడ్లు ఉన్నాయి. వీటిలో ఒక్క నల్లగొండ జిల్లాలో 1,836.43 కి.మీ. సూర్యాపేట జిల్లాలో 907.598 కి.మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో 877.363 కి.మీ. మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి. జిల్లాకు చెందిన కోమటిరెడి వెంకట్‌రెడ్డి రోడ్లు–భవనాల శాఖ మంత్రి కావడంతో ఏడాది రెండేళ్లలో ఈ రోడ్లన్నీ కొత్తందాలు సంతరించుకోనున్నాయి. సింగిల్‌ రోడ్లు డబల్‌ రోడ్లుగా, డబల్‌ రోడ్లు నాలుగులైన్లుగా విస్తరణ జరిగి ప్రజల రవాణ కష్టాలు తీరనున్నాయి. ఫలితంగా వ్యాపారం, వ్యవసాయం మరింత అభివృద్ధి చెందనుందని ప్రజలు భావిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సింగిల్‌ రోడ్డుగా ఉన్న నల్లగొండ–ధర్మాపురం రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు తొలి సంతకం చేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫ నాలుగు లేన్లుగా ముశంపల్లి రోడ్డు

ఫ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి

సంతకం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఫ 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటన

ఫ వారంలోగా టెండర్లు పిలవాలని

అధికారులకు ఆదేశం

తొలి విడతలో అభివృద్ధి చెందే రోడ్లు ఇవే..

రోడ్లు– భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తొలి విడతలో భాగంగా నల్లగొండ–ముశంపల్లి–ధర్మాపురం రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్లగొండ నుంచి మల్లేపల్లి వరకు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సౌత్‌–చౌటుప్పల్‌ రోడ్డు, ఆరు లేన్ల రోడ్డుగా హైదరాబాద్‌–విజయవాడ హైవేలు విస్తరించేందుకు యోచన చేస్తోన్నట్టు తెలిసింది. అలాగే నల్లగొండ పట్టణ పరిధిలో మిగిలి ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు నకిరేకల్‌–నాగార్జునసాగర్‌ రోడ్డు అభివృద్ధి పనులను కొనసాగిస్తారు.

Advertisement
Advertisement