విద్యుత్‌ శాఖలో ఇష్టారాజ్యం | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖలో ఇష్టారాజ్యం

Published Fri, Dec 15 2023 1:04 AM

- - Sakshi

నల్లగొండ: జిల్లాలోని విద్యుత్‌ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయి. ఆ శాఖ ఎస్‌ఈ నిబంధనలు తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను బదిలీ చేశారని సొంతశాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ శాఖలో బదిలీలకు సంబంధించి నిషేధం ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా ముగ్గురు ఇంజనీర్లను బదిలీ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఎన్నికల కోడ్‌ ముగిసిన మరుసటి రోజే..

అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోడ్‌ డిసెంబర్‌ 5వ తేదీన ముగిసిన మరుసటి రోజే బదిలీలకు తెర లేపారు. దీనికి తోడు విద్యుత్‌ శాఖలో బదిలీలకు సంబంధించి నిషేధం కూడా ఉంది. అయినప్పటికీ బదిలీలు చేసేశారు. ఇందులో నల్లగొండ ఎంఅండ్‌పీలో పనిచేసే ఏఈ అమర్‌సింగ్‌ను మిర్యాలగూడ రూరల్‌ ఏఈగా బదిలీ చేశారు. అదేవిధంగా సెలవులో ఉన్న ఏఈ అశ్వనిని నల్లగొండ ఎంఅండ్‌పీ ఏఈగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే హాలియాలో సబ్‌ ఇంజనీర్‌గా పనిచేసిన షఫిని నల్లగొండ కమర్షియల్‌ సబ్‌ ఇంజనీర్‌గా బదిలీ చేశారు. చండూరులో పనిచేసే నాగయ్య అనే వ్యక్తి రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉండి ఎప్పటి నుంచో నల్లగొండకు బదిలీ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి రిటైర్‌మెంట్‌ దగ్గర ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ, సెలవులో ఉన్న ఏఈకి బదిలీ పోస్టింగ్‌ ఇవ్వడం పట్ల పలువురు అనుమానం వ్యకం చేస్తున్నారు. ఇకపోతే, సాగర్‌లో సబ్‌ ఇంజనీర్‌గా చేసే ఉదయ్‌ కిరణ్‌ తనను నల్లగొండకు బదిలీ చేయాలని గతంలోనే దరఖాస్తు చేసుకున్నా అతన్ని బదిలీ చేయకుండా హాలియాలో సబ్‌ ఇంజనీర్‌గా పనిచేసే షఫిని నల్లగొండ కమర్షియల్‌ విభాగానికి బదిలీ చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

బదిలీలపై అనుమానాలెన్నో..

విద్యుత్‌ శాఖ బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ ఆ శాఖ ఎస్‌ఈ పట్టించుకోకపోగా ఎన్నికల ప్రక్రియ ముగిసినా కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే పలువురు ఉద్యోగులను బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో ముడుపుల వ్యవహారం నడిచి పెద్ద ఎత్తున చేతులు మారినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే అత్యవసరంగా బదిలీల ప్రక్రియ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని విద్యుత్‌ శాఖ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈని ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించకపోవడం గమనార్హం.

ఫ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల బదిలీ

ఫ నిషేధమున్నా పట్టించుకోని ఆ శాఖ ఎస్‌ఈ

ఫ ఇప్పటికే ముగ్గురు ఇంజనీర్ల ట్రాన్స్‌ఫర్‌

ఫ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు

బదిలీలు కక్ష పూరితం

విద్యుత్‌ శాఖలో అనుకోకుండా ఏవైనా ప్రమాదాలు జరిగితే ఉన్నతాధికారులు ఒక్కో ఘటనపై ఒక్కో విధంగా వ్యవహరిస్తూ గిరిజన ఉద్యోగుల పట్ల పక్షపాతంగా ఉంటున్నారు. కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగిన సందర్భంలో కింది స్థాయి ఉద్యోగులు మీద చర్యలు తీసుకుంటున్నారు. మిర్యాలగూడలో మాత్రం ఏఈని సరెండర్‌ చేయడం, నాంపల్లిలో పనిచేసే సబ్‌ ఇంజనీర్‌ను చందంపేట ఏఈగా బదిలీ చేయడం కక్ష పూరితమే.

– వెంకటేశ్వర్లు నాయక్‌,

గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి

Advertisement
Advertisement