8న ‘నీలగిరి’ అవిశ్వాసం | Sakshi
Sakshi News home page

8న ‘నీలగిరి’ అవిశ్వాసం

Published Sun, Dec 24 2023 1:16 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి నల్లగొండ : నీలగిరి మున్సిపాలిటీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం తేదీ ఖరారైంది. వచ్చే నెల 8వ తేదీన అవిశ్వాస సమావేశం నిర్వహిస్తామని పేర్కొంటూ కలెక్టర్‌.. మున్సిపల్‌ పాలకవర్గానికి ఫారం–2 నోటీసులను ఈనెల 22వ తేదీతో జారీ చేశారు. 8వ తేదీన ఉదయం 11.30 గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో అవిశ్వాస సమావేశం నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు 30 మంది సంతకాలతో నోటీసులు ఇచ్చిందని.. మున్సిపల్‌ కమిషనర్‌ సహకారంతో కార్యాలయంలో నిర్వహిస్తున్న రికార్డుల ప్రకారం వారందరి సంతకాలు సరైనవేనని నిర్ధారించుకున్నట్లు ఆ ఫారంలో వివరించారు. ఈ అవిశ్వాస సమావేశానికి హాజరుకావాలని మున్సిపాలిటీలోని 48 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్‌ అఫీషియో సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అవిశ్వాసం నెగ్గే అవకాశం..!

మున్సిపల్‌ చైర్మన్‌పై కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 30 మంది సంతకాలతో అవిశ్వాసం నోటీసు ఇవ్వడం, అవి సరైనవేనని అధికారులు ధ్రువీకరించుకున్నారు. మరోవైపు మూడు రోజుల కిందట మరో కౌన్సిలర్‌ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 31కి చేరింది. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌన్సిల్‌లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. ఆయనతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో విబేధాలతో బీఆర్‌ఎస్‌నుంచి బయటికి వచ్చిన కౌన్సిలర్‌ పిల్లి రామరాజు యాదవ్‌తో కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ముగ్గురిని కలుపుకుంటే కాంగ్రెస్‌ కౌన్సిలర్ల బలం 34కు చేరుతుంది. దీనికి తోడు మరికొంత మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా నీలగిరి మున్సిపాలిటీ పీఠాన్ని గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకోవడానికి మార్గం సులువు కానుంది.

ఫ నల్లగొండ మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు, ఎక్స్‌ అఫీషియో సభ్యులకు ఫారం–2 నోటీసులు జారీ

ఫ 30 మంది సంతకాలతో చైర్మన్‌పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

ఫ 15 రోజుల సమయం ఇస్తూ తేదీ ఖరారు చేసిన మున్సిపల్‌ కమిషనర్‌

మొదట్లో తక్కువగానే ఉన్నా..

మొదటి నుంచి మున్సిపాలిటీపై హస్తం పార్టీ ఆధిపత్యమే కొనసాగుతోంది. 2000 సంవత్సరం నుంచి వరుసగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే చైర్మన్‌గా వ్యవహించారు. 2005, 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీనే అత్యధికంగా కౌన్సిలర్లను గెలుచుకొని చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది. 2020లో మాత్రం కాంగ్రెస్‌ 20, బీఆర్‌ఎస్‌ 20 స్థానాలను గెలుచుకుంది. అప్పుడు బీఆర్‌ఎస్‌ 20 స్థానాలకే పరిమితమైనా, ఎక్స్‌ అఫీషియో సభ్యులతో ఓట్లతో చైర్మన్‌ పదవి దక్కించుకుంది. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందన్న ధీమాతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. అది నెగ్గాక ప్రస్తుతం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న బుర్రి శ్రీనివాస్‌రెడ్డినే చైర్మన్‌ను చేసే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement