భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి..? | Sakshi
Sakshi News home page

భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి..?

Published Wed, Jan 3 2024 4:38 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీలో నిలబడడానికి పలువురు నేతల వారసులు ఆసక్తి చూపుతున్నారు. నల్లగొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించగా.. బీఆర్‌ఎస్‌ నుంచి శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. భువనగిరి ఎంపీ స్థానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలనే ఆలోచన చేస్తున్నారు. మరో వైపు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తనయుడు సూర్యపవన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలువడం చర్చనీయాంశమైంది.

వివిధ వేడుకలతో జనాల్లోకి..
అగ్రనేతల తనయులు వారి పుట్టిన రోజు, నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర సందర్భాలను పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున నల్లగొండ ఎంపీ టికెట్‌ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రఘువీర్‌ తమ్ముడు జయవీర్‌రెడ్డి సాగర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ టికెట్‌ను రఘువీర్‌రెడ్డికి ఇప్పించేందుకు జానారెడ్డి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ప్రస్తుతం పార్లమెంట్‌ కోసం పోటీ చేయించాలానే ఆలోచనలో భాగంగా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రఘువీర్‌ రెడ్డి తన పుట్టిన రోజు సందర్బంగా హైదరాబాద్‌తో పాటు హాలియాలోనూ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ నుంచి గుత్తా తనయుడు..
బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్‌ 31న ఆయన జన్మదినం సందర్భంగా గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో ఆయన మునుగోడు టికెట్‌ ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం పార్లమెంట్‌ టికెట్‌ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాడు రెండు పార్లమెంట్‌ నియోజక వర్గాలైన నల్లగొండ, భువనగిరి ఏ నియోజకవర్గాల నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల నిర్వహించిన చిట్‌చాట్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు.

ఎవరి ప్రయత్నాల్లో వారే..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్‌ను రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ఇవ్వగా.. పటేల్‌ రమేష్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగడంతో పాటుఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయనకు అప్పటి కాంగ్రెస్‌ నేతలు ఎంపీగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీ టికెట్‌ తనకే వస్తుందనే ఆలోచనల్లో రమేష్‌రెడ్డి ఉన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దామోదర్‌ రెడ్డి కూడా ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ నుంచి గార్లపాటి జితేందర్‌, సంకినేని వెంకటేశ్వర్‌రావు, మన్నెం రంజిత్‌ యాదవ్‌, బండారు ప్రసాద్‌, గోలి మదుసూదన్‌రెడ్డి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. భువనగిరి ఎంపీ టికెట్‌ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, తీన్మార్‌ మల్లన్న, జెడ్పి మాజీ చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి భువనగిరి మాజీ ఎమ్మల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్‌ ప్రయత్నిస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఆశిస్తున్నట్లు తెలిసింది.

రంగంలోకి ‘కోమటిరెడ్డి’ కుటుంబం
భువనగిరి పార్లమెంట్‌ సీటు కోసం ‘కోమటిరెడ్డి’ కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి లక్ష్మిని భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనల్లో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తనయుడు సూర్యపవన్‌రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. అందులో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డిని కలువడం చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సరం, సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు భువనగిరి ఎంపీ టికెట్‌ను కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కూతురు కీర్తిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement