రైలు పట్టాల సమీపంలో మంటలు | Sakshi
Sakshi News home page

రైలు పట్టాల సమీపంలో మంటలు

Published Sat, Apr 20 2024 1:45 AM

రైలు పట్టాల సమీపంలో దట్టమైన మంటలు 
 - Sakshi

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

మిర్యాలగూడ అర్బన్‌: రైలు పట్టాల సమీపంలో మంటలు వ్యాపించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కుక్కడం వద్ద చోటు చేసుకుంది. రైల్వే ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం వద్ద రైలు పట్టాల సమీపంలో రైతులు ఎండిపోయిన వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో మంటలు క్రమంగా వ్యాపిస్తూ రైలు పట్టాల వద్దకు వచ్చాయి. దీంతో విషయాన్ని తెలుసుకున్న రైల్వే సిబ్బంది గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. మంటలను ఆర్పిన అనంతరం రైలు బయలుదేరి వెళ్లింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్‌ఐ పేర్కొన్నారు.

నీటి ఎద్దడి రాకుండా చూడాలి

కేతేపల్లి: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓ టి.నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కేతేపల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తాగునీటి ట్యాంకులను నెలలో మూడు సార్లు శుభ్రం చేయించటంతో పాటు, లీకేజీ అయిన పైప్‌లైన్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ పనులు లేనందున అన్ని గ్రామాల్లో కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎల్‌పీఓ వెంకటేశ్వర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు బి.శ్రీనివాసరావు, లక్ష్మినారాయణ, ఎంఈఓ నాగయ్య, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు శ్రీనివాస్‌, మౌనిక, ఐకేపీ ఏపీఎం యాదమ్మ, ఈజీఎస్‌ ఏపీఓ సురేందర్‌, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం, ఆలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజ వాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవంతో పాటు శ్రీస్వామి, అమ్మవారి సేవలను ఊరేగించారు.

వైభవంగా ఊంజలి సేవోత్సవం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. ఆ తర్వాత ఆండాళ్‌ అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు.

శ్రీలక్ష్మీనరసింహులకు లక్ష పుష్పార్చన పూజ చేస్తున్న అర్చకులు
1/2

శ్రీలక్ష్మీనరసింహులకు లక్ష పుష్పార్చన పూజ చేస్తున్న అర్చకులు

మాట్లాడుతున్న డీఆర్‌డీఓ నాగిరెడ్డి
2/2

మాట్లాడుతున్న డీఆర్‌డీఓ నాగిరెడ్డి

Advertisement
Advertisement