బోగస్‌ హాజరుతో బొక్కేశారు! | Sakshi
Sakshi News home page

బోగస్‌ హాజరుతో బొక్కేశారు!

Published Thu, May 18 2023 1:34 AM

- - Sakshi

● ఉపాధి హామీ పథకంలో అక్రమాలు ● టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లపై అవినీతి ఆరోపణలు ● నామమాత్రపు తనిఖీలు చేస్తున్న అధికారులు ● పక్కదారి పట్టినప్రభుత్వ లక్ష్యం

పగిడ్యాల: వలసలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరమైంది. మేట్‌లు బోగస్‌ హాజరుకు పాల్పడుతూ ఉపాధి నిధులను స్వాహా చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. గ్రామంలో లేని వారి పేర్లు మస్టర్‌లో నమోదు చేసి ఉపాధి నిధులను కొల్లగొడుతున్నారు. అలాగే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు, ఎంబీబీఎస్‌, పీజీ కోర్సులు చేస్తున్న వారి పేరు మీద వేతనాల స్లిప్‌లు రావడం చూసి గ్రామస్తులు విస్మయానికి గురవుతున్నారు. పగిడ్యాల మండలం ఎన్‌. ఘణఫురంలో ఉపాధి హామీ పథకం పనుల్లో ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు చేస్తున్న అక్రమాలను అధికారులు అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.

పనిచేయకుండా హాజరు

పగిడ్యాల మండలంలో 9,182 జాబ్‌కార్డులు ఉండగా రోజుకు 2,700 మంది కూలీలు పనులకు వెళ్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోంది. అయితే ఎం.ఎన్‌. ఘణఫురం గ్రామంలో కొందరు కూలీలు ఉదయం పని ప్రదేశానికి చేరుకుని మొదటి ఫొటోను అప్‌లోడ్‌ చేసి ఇంటికి చేరుకుంటున్నారు. పని చేయకుండా మళ్లీ 11 గంటల ప్రాంతంలో ఫొటో అప్‌లోడ్‌ చేసేందుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఒక్కొక్క కూలీకి సరాసరి సగటున రూ. 237 దినసరి వేతనం చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో మండల వ్యాప్తంగా వారానికి రూ. 23 లక్షల ఉపాధి వేతనం కూలీల ఖాతాల్లోకి జమ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నెల రోజులకే రూ. 1.03 కోట్లు నిధులను ప్రభుత్వం కూలీలకు చెల్లించినట్లు ఏపీఓ మద్దిలేటి తెలిపారు.

జాబ్‌కార్డుదారులకు తెలియకుండా..

ఫీల్డ్‌అసిస్టెంట్లు జాబ్‌కార్డుదారులకు తెలియకుండా బోగస్‌ హాజరు వేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా యాప్‌లో వేరొకరి ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి తనిఖీలకు వచ్చే అధికారులకు ఈ విషయం తెలియడం లేదు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది చేసే అక్రమాలు వెలుగులోకి రావడం లేదు. సామాజిక తనిఖీ బృందం కూడా డబ్బుకు దాసోహమై అవినీతిని నిర్ధారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పేద కూలీల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తుంటే, ఫీల్డ్‌ అసిసెం్ట్ల అక్రమాల కారణంగా ఆ నిధులు పక్కదారి పడుతున్నాయి.

ఎన్‌. ఘణపురంలో పనులు చేయకుండా పంట కాలువలకు గడ్డి కోసిన దృశ్యం, చెట్ల కింద సేద తీరుతున్న కూలీలు

నా దృష్టికి వచ్చింది

కూలీలు పని చేయకుండా ఫొటోలు దిగి ఇంటికి వెళ్తున్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. నిబంధనల మేరకు పనులు చేయించాలని టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను ఆదేశించాను. కూలీల వద్ద డబ్బులు వసూలు చేసే విషయం నా దృష్టికి రాలేదు.

– మద్దిలేటి, ఏపీఓ, పగిడ్యాల

నేను పనికి వెళ్లలేదు

గ్రామంలోని ఓ రైతు ఇంట్లో నేను గాసం ఉన్నాను. ఉపాధి పనులకు వెళ్లడం లేదు. ఇంట్లో నా భార్య వెళ్తోంది. నా పేరు మీద హాజరు వేసి డబ్బులు స్వాహా చేసే సంగతి తెలియదు. మస్టర్‌ రోల్‌(1483)లో రెండు రోజులు పని చేసినట్లు నమోదు చేసి అకౌంట్‌లోకి రూ. 525జమ చేసిన విషయం నాకు తెలియదు.

– ముర్తుజావలీ, ఎం. ఘణపురం

అవినీతి జరుగుతోంది

ఎం. ఘణపురం గ్రామ పంచాయతీలో జరిగే ఉపాధి పనుల్లో భారీ అవినీతి జరుగుతోంది. కూలీలు కొందరు పనులు చేయడం లేపదు. ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు ఒక్కొక్క కూలీ వద్ద రూ. 50 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. దీంతో కొందరు గ్రామస్తులు కోపోద్రేక్తులై నాపై దాడి చేశారు.

– బషీర్‌, ఎన్‌. ఘణపురం

అక్రమాలు ఇవీ..

ఎన్‌. ఘణపురం అంగన్‌వాడీ కేంద్రంలో షేక్‌ మౌలాబి ఆయాగా పనిచేస్తున్నారు. ఈమే పేరు మీద మస్టర్‌(1471) మే ఒకటి నుంచి 6వ తేది వరకు పనిచేసినట్లు నమోదు చేసి రూ. 1,020 అకౌంట్‌లోకి జమ చేశారు.

దూదేకుల షేక్షావలీ నిజామబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఇతని పేరు మీద మస్టర్‌(737, 1460, 1067) 9రోజులు పని చేసినట్లు నమోదు చేసి రూ. 2111.47 అకౌంట్‌లోకి జమ చేశారు.

బోయ మంగమ్మ, బోయ పెద్దయ్య ఊర్లో లేరు. వీరి జాబ్‌కార్డ్‌ 20023పై మస్టర్‌ 737లో 5 రోజులు పనిచేసినట్లు నమోదు చేసి రూ. 1,323.15 జమ చేశారు.

నన్నూరు లక్ష్మీదేవి జాబ్‌కార్డు(20034)( మస్టర్‌ రోల్‌: 713, 1457, 1064)లో పనికి వెళ్తే ఆమె భర్త నరసింహుడు పేరు మీద హాజరు వేసి ఇద్దరు 19 రోజులు పనిచేశారని రూ. 4,364. 89 అకౌంట్‌లోకి అప్‌లోడ్‌ చేశారు.

జాబ్‌కార్డ్‌(20046)లో ఒక్క కృష్ణవేణి పనికి వెళ్తే గంగాధర్‌ (లారీ డ్రైవర్‌), రామకృష్ణ పేర్ల మీద బోగస్‌ హజరు వేసి 22 పనిదినాలకు రూ. 5725 చెల్లించారు.

ఎన్‌. ఘణపురం గ్రామానికి ప్రవీణ్‌(ఎంబీబీఎస్‌లో పీజీ చేస్తున్నాడు), రాఘవేంద్ర(సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి)పేర్లపై ఉపాధి వేతన స్లిప్పులు వచ్చాయి.

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement