తెలుగు తమ్ముళ్ల మద్యం దందా | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల మద్యం దందా

Published Wed, Jun 21 2023 11:36 AM

- - Sakshi

నంద్యాల: మద్యం అక్రమ రవాణాను టీడీపీ నాయకుల వదులుకోలేకపోతున్నారు. తరచుగా పోలీసులకు పట్టుబడుతున్నా వారి తీరు మారడం లేదు. ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 5వ తేదీన ప్యాపిలి పట్టణానికి చెందిన తెలుగు యువత అధికార ప్రతినిధి బోరెడ్డి అభిలాష్‌ రెడ్డి తన ఐదుగురు అనుచరులతో కలిసి బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో అక్రమ మద్యంతో సెబ్‌ పోలీసులకు పట్టుబడ్డారు.

ఈ సందర్భంగా బండారు రవి తప్పించుకు పోయారు. గత ఏప్రిల్‌ నెలలో అనంతపురం జిల్లా మడకశిర పోలీసులకు కూడా అభిలాష్‌రెడ్డి కారులో కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇతనిపై సెబ్‌ పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై తిరిగొచ్చి మళ్లీ అక్రమ మద్యం దందానే కొనసాగిస్తున్నాడు.

రిమాండ్‌కు తెలుగు యువత అధ్యక్షుడు
ఆర్‌ఎస్‌ రంగాపురం వద్ద సెబ్‌ పోలీసుల కళ్లు గప్పి ఈనెల 5వ తేదీన తప్పించుకుపోయిన బండారు రవి డోన్‌ మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇతను మంగళవారం సెబ్‌ పోలీసులకు పట్టుబడటంతో రిమాండ్‌కు తరలించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు తెలుగుతమ్ముళ్లు అక్రమ మద్యం వ్యాపారంలో కొనసాగుతుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఐదేళ్ల క్రితం అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌తో పాటు అనేక మంది ఆ పార్టీ నాయకులు ఉడుములపాడు గ్రామంలో కల్తీ మద్యం తయారు కేంద్రాన్ని నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చింత చచ్చినా పులుపు చావదనే చందంగా ఆ పార్టీ నాయకులు తమ పాత పద్ధతులను మానుకోక పోవడంపై స్థానిక ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

Advertisement
Advertisement