నేడు కౌలుదారులకు పెట్టుబడి సాయం | Sakshi
Sakshi News home page

నేడు కౌలుదారులకు పెట్టుబడి సాయం

Published Fri, Sep 1 2023 2:50 AM

-

నంద్యాల(సెంట్రల్‌): వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద సీసీఆర్‌సీ కార్డులు పొందిన కౌలుదారులకు వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం విడుదల కార్యక్రమం శుక్రవారానికి వాయిదా పడింది. గురువారమే కౌలుదారుల బ్యాంకు ఖాతాలకు పెట్టుబడి సాయంగా రూ.7,500 ప్రకారం నగదు విడుదల కావాల్సి ఉంది. చివరి నిమిషంలో వాయిదా పడిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 9,521 మంది లబ్ధిదారులు ఉండగా వారిలో 9,432 మంది కౌలు రైతులు, 89 మంది దేవదా య భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మొత్తం రూ.7.14 కోట్లను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి నిధుల్ని విడుదల చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలాంటి సొంత భూమిలేని 16,486 మందికి ప్రభుత్వం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) ద్వారా నగదు బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. సాగుదారులకు పెట్టుబడి సాయం రూ.13,500 పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. మొదటి విడతలో రూ.7,500 ప్రకారం ఉమ్మడి జిల్లాలో రూ.12,36,45,000 సాగుదారులకు బ్యాంకు ఖాతాలకు విడుదల చేస్తుండటం విశేషం.

2న జెడ్పీలో సర్టిఫికెట్ల పరిశీలన

కర్నూలు(అర్బన్‌): రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టుల మెరిట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 2న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. 54 పోస్టులకు సంబంధించి మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల మేరకు 1:2 రేషియో ప్రకారం 108 మంది అభ్యర్థుల తాత్కాలిక జాబితాను http://kurnool.ap.nic.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధృవపత్రాలతో పాటు గెజిటెడ్‌ అధికారి సంతకంతో కూడిన రెండు సెట్ల సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలన్నారు.

నేటి నుంచి పింఛన్ల పంపిణీ

నంద్యాల(న్యూటౌన్‌): వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద నంద్యాల జిల్లాకు 4,963 కొత్త పింఛన్లు మంజూరైనట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే గ్రామ, వార్డు వలంటీర్లు పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారన్నారు. జిల్లాలో 2,17,867 పింఛన్లకు గాను రూ.60.14 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తదితరులు పింఛన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మహిళా కూలీకి వజ్రం లభ్యం

తుగ్గలి: మహిళా కూలీకి వజ్రం రూపంలో అదృష్టం తలుపుతట్టింది. గురువారం జొన్నగిరి సమీపంలోని పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం దొరింది. దీనిని రూ.40వేలు నగదు, తులం బంగారం ఇచ్చి ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Advertisement
Advertisement