చేపల వినియోగాన్ని పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

చేపల వినియోగాన్ని పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం

Published Fri, Nov 3 2023 2:16 AM

- - Sakshi

చేపల వినియోగాన్ని పెంచుతున్న

రాష్ట్ర ప్రభుత్వం

నేటి నుంచి ప్రాన్స్‌ అండ్‌

ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

కర్నూలులో మూడు రోజుల పాటు

నిర్వహణ

రూ.399తో చేపలు,

రొయ్యల వంటకాలు తినే అవకాశం

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించవా నాకు.. అంటూ ఓ సినిమాలో గీతం ప్రేక్షకులను అలరించింది. అలాగే ప్రజల జిహ్య ‘చేప’ల్యాన్ని తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాన్స్‌ అండ్‌ ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని రకాల చేపలు, రొయ్యల వంటలు లభించనున్నాయి. చేపల, రొయ్యల పులుసు.. ఫిష్‌ బాల్స్‌, ఫిష్‌ పింగర్స్‌, ఫిష్‌కట్‌లైట్‌, వడియాలు, ఫిష్‌ పిల్లెట్స్‌, ఫిష్‌ వేఫర్స్‌, ఫిష్‌ పేస్ట్‌, నూడిల్స్‌, సమోసా, ఫ్రైసూప్‌ తదితర వంటకాలు నోరూరించనున్నాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌): చేపలు, రొయ్యల్లో మాంసకృత్తులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. హృద్రోగులకు, అస్తమా, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి ఆహారంగా పని చేస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపలు, రొయ్యల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫిష్‌ ఆంధ్ర ఔట్‌లెట్లు ఏర్పాటు చేయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రజలకు సముద్రపు చేపలు, నదుల్లో లభించే చేపలు, రొయ్యలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాన్స్‌ అండ్‌ ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇప్పటికే విజయవాడ, నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. తాజాగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి కర్నూలులో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో రావూస్‌ గార్డెన్‌లో ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన, జేసీ మౌర్య, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

రూ.399తో అన్‌లిమిటెడ్‌గా

ఆరగించే అవకాశం...

ప్రాన్స్‌ అండ్‌ ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో బఫే పద్ధతిలో పుడ్‌ కోర్టు నిర్వహించనున్నారు. రూ.399 చెల్లిస్తే చేపలు, రొయ్యల వంటకాలను అన్‌ లిమిటెడ్‌గా ఆరగించే అవకాశాన్ని మత్స్యశాఖ కల్పిస్తోంది.ఫెస్టివల్‌లో అనేక రకాల వంటకాలు నోరూరించనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రజలకు ఉప్పునీటి, మంచినీటి చేపలు, రొయ్యలు అందుబాటులోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై ఇక్కడ సెమినార్‌లు నిర్వహించనున్నారు. చేపలు, రొయ్యల్లో ఉండే పోషకాలు, వాటిని వినియోగించడం వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించనున్నారు. బతికిన అన్ని రకాల చేపలతో మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు. మత్స్యశాఖ, ఫిష్‌ ఆంధ్ర కింద వివిధ యూనిట్‌లు నడుపుతున్న వారితో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో చేపలు, రొయ్యలకు సంబంధించిన స్నాక్స్‌ లభిస్తాయి. మొదటిసారిగా కర్నూలులో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా మత్స్యశాఖ అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

వినియోగం పెంచేలా..

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నేడు సముద్రపు చేపలు కూడా పట్టణ, గ్రామీణ ప్రజల ముంగిటకు వచ్చాయి. మత్స్యశాఖ మూడేళ్ల క్రితం చేపట్టిన సర్వే ప్రకారం మాంసాహారులు ఒక్కొక్కరు ఏడాదికి సగటున 8 కిలోల వరకు మాత్రమే చేపలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా చేపలు, రొయ్యల వినియోగం బాగాపెరిగింది. సగటు వినియోగాన్ని 20 కిలోలకు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాన్స్‌ అండ్‌ ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది.

చేపలతో ఇవీ లాభాలు..

చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్‌, సెరొటోనిన్‌ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని పరిశోధనల్లో వెల్లడైంది.

చేపల్లో అన్ని రకాల పోషకాలు.. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్‌ లభిస్తాయి. విటమిన్‌ ఏ, విటమిన్‌ డీతోపాటు పాటు ఫాస్పరస్‌ వంటి పోషకాలు వీటి నుంచి మనకు అందుతాయి.

చేపల్లో ఉండే విటమిన్‌ బీ2 రైబోఫ్లావిన్‌ మన శరీరానికి ఎంతో మేలుచేస్తుంది. శరీరం ఆక్సిజన్‌ తీసుకునేలా సహకరిస్తుంది.

వ్యాధి నిరోధకశక్తి పెరుగాలన్నా, కడుపులో మంట, వేడి తగ్గాలన్నా చేపలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

అర్థరైటీస్‌ సమస్యతో బాధ పడేవారికి చేపలు సరైన మందు.

అల్జీమర్‌, డియోన్షియా, మతిమరపు లాంటి లక్షణాలను తగ్గిస్తాయి.

చేపల్లోని ఐరన్‌... రక్తంలో హిమోగ్లోబిన్‌ సరిపడా ఉండేలా చేస్తుంది.

పేగుల్లో గ్యాస్‌, ఇతరత్రా సమస్యలు రావు.

Advertisement
Advertisement