టీబీ డ్యాంకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

Published Tue, Nov 14 2023 1:44 AM

వైద్య ఆరోగ్య సేవలపై ప్రజాభిప్రాయ సేకరణలో సెంట్రల్‌ టీం బృందం - Sakshi

హొళగుంద: కర్ణాటకలోని హొస్పేట్‌ వద్దనున్న తుంగభద్ర రిజర్వాయర్‌కు కొద్ది రోజులుగా ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. ఈ ఏడాది డ్యాంలో నీటి చేరిక నిరాశాజనకంగా ఉంది. అయితే ఇటీవల డ్యాం ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా స్వల్పంగా వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి 100 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఈ ఏడాది 25 టీఎంసీలకే పరిమితమైంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1,633 అడుగులు కాగా.. సోమవారం 1,602.50 అడుగులకు చేరుకుంది. ఔట్‌ఫ్లో 7,993 క్యూసెక్కులు ఉండగా 7,151 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

సుంకేసుల నుంచి వరద

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయం ఎగువ పరీవాహక ప్రాజెక్ట్‌ అయిన సుంకేసుల నుంచి సోమవారం 6,660 క్యూసెక్కుల వరద నీరు విడుదలైంది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాంతాలకు 4,022 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.బ్యాక్‌వాటర్‌ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,210 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 268 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమవారం సాయంత్రం నాటికి జలాశయంలో 64.1764 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

రేపు కర్నూలుకు

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌

కర్నూలు(సెంట్రల్‌): ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 15న రాత్రి ఆయన కర్నూలుకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు. 16న ఉదయం 9 గంటలకు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడి యాగంటి ఉమా మహేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తారు.

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కేంద్ర బృందం సర్వే

పగిడ్యాల: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కేంద్ర బృందం సోమవారం పగిడ్యాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసింది. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో భాగంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ బృందం సభ్యులు ఆరా తీశారు. బృందం సభ్యులు నాగమణి, జిల్లా కోర్‌టీం వెంకటరమణ, జగదీశ్వరప్ప, లక్ష్మీనారాయణ ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స చేయించుకోవటానికి వచ్చిన వారితో పాటు గ్రామంలో 22 ఇళ్లకు వెళ్లి వైద్యసేవలు బాగా అందుతున్నాయా? వైద్యు లు మంచిగా చికిత్సలు అందిస్తున్నారా? అంటూ ఆరా తీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యసేవల అమలును ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తెలుసుకొంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను మరింత మెరుగ్గా అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సర్వే బృందంతో పాటు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ, స్టాటిస్టికల్‌, ఆఫీసర్‌ సుజాత, ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌, సీహెచ్‌ఓ టి.రామగుర్రప్పలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement