ఉమ్మడి బ్యాంక్‌ ఖాతా తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ఉమ్మడి బ్యాంక్‌ ఖాతా తప్పనిసరి

Published Wed, Nov 15 2023 1:52 AM

-

నంద్యాల(న్యూటౌన్‌): జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకానికి తల్లితో పాటు విద్యార్థికి ఉమ్మడిగా బ్యాంక్‌ ఖాతా తప్పనిసరిగా ఉండాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామని మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఆయా పథకాలకు సంబంధించి ఇప్పటివరకు విద్యార్థుల తల్లుల ఖాతాలలోనే ఆ మొత్తాన్ని జమ చేసేవారన్నారు. ఇకపై జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనలో అర్హులైన విద్యార్థులు తమ తల్లితో కలిసి ఉమ్మడి ఖాతా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్తగా ఈ ఖాతాలో విద్యార్థి ప్రాథమిక ఖాతాదారునిగా, తల్లి ద్వితీయ ఖాతాదారునిగా ఉండాలన్నారు. ఇప్పటికే విద్యార్థి, తల్లికి బ్యాంక్‌ ఖాతా ఉంటే ఉమ్మడిగా చేర్చి మార్చుకోవచ్చన్నారు. తల్లులతో పాటు విద్యార్థులకు బాధ్యత ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఎస్సీ, చివరి సంవత్సరం చదువుతున్న అన్ని క్యాటగిరీ విద్యార్థులకు జాయింట్‌ బ్యాంక్‌ ఖాతా అవసరం లేదన్నారు. నాలుగవ విడత జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఈ నెల 24వ తేదీలోగా ఖాతాలు ఓపెన్‌ చేసి జేవీడీకి అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల వారి పరిధిలో ఉన్న సచివాలయాల్లో జాయింట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ఇవ్వాలన్నారు.

నేటి నుంచి పశు ఆరోగ్య కార్డుల పంపిణీ

నంద్యాల(సెంట్రల్‌):రాష్ట్ర ప్రభుత్వం పశు విజ్ఞాన బడిలో భాగంగా పశువైద్య సేవల్ని ఆర్‌బీకేల స్థాయికి విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది. దీని కి అనుగుణంగా మూగజీవాలకు సైతం ఆరోగ్య కార్డుల్ని జారీ చేస్తోంది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఈ నెల 30 వరకు ఆరోగ్య కార్డుల్ని పంపిణీ చేయనున్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖాధికారి గోవిందనాయక్‌ మంగళవారం ఓప్రకటనలో తెలిపారు.జిల్లాలో మొత్తం 97,900 ఆవులు, గేదెలతో పాటు 22,400 మేకలు, గొర్రెలకు ఈ కార్యక్రమంలో భాగంగా కార్డుల్ని ఇవ్వనున్నామన్నారు. కార్డులో పశువులకు అందించే వైద్య సేవలు, ఉచిత టీకాల వివరాలు ఉంటాయన్నారు. కార్డుతో పెంపకందారులు అత్యవసర వైద్య సంరక్షణ నుంచి టీకాల వరకు అనేక వైద్య సేవల్ని రూపాయి ఖర్చు లేకుండా ఆర్‌బీకేల స్థాయిలోనే పొందేందుకు కార్డులు ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.

రూ.80 కోట్లతో 30 రోడ్లకు టెండర్లు పూర్తి

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.80 కోట్లతో 30 రోడ్ల పనులు చేపట్టనున్నట్లు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు సీఎంఓ ప్రతిపాదనలు కోరిందన్నారు. రూ.45.60 కోట్ల అంచనాతో 21 మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్స్‌, స్టేట్‌ హైవేస్‌ కింద రూ.34.40 కోట్ల అంచనాతో 9 రోడ్లకు ప్రతిపాదనలు పంపగా, వాటి ని ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నేపథ్యంలోనే టెండర్లను కూడా పూర్తి చేశామన్నారు.

పనులకు అగ్రిమెంట్‌ పూర్తయిన రోడ్లు

● పెద్దకడుబూరు నుంచి దొడ్డిమేకల వరకు 10 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.30 కోట్లు

● కపటి నుంచి పెద్దతుంబళం వరకు 13 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.60 కోట్లు.

● నెల్లూరు–బళ్లారి–బాంబే హైవేలో 231/2 కి.మీ నుంచి 233/1 వరకు రూ.1.20 కోట్లు

● డోన్‌ – రాయలచెరువు 1/6 నుంచి 2/0 కి.మీ వరకు రూ.50 లక్షలు.

క్వింటా మిర్చి రూ.27,525

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఎండుమిర్చి ధర జోరుమీద ఉంది. 2023–24లో సాగు చేసిన మిర్చి పంటకు సంబంధించిన దిగుబడులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు 105 క్వింటాళ్లు అమ్మకానికి రాగా.. అత్యధికంగా రూ.27,525 ధర లభించడం విశేషం. కనిష్ట ధర రూ.5,099, మోడల్‌ ధర రూ.15,509 నమోదైంది. 2022–23లో జిల్లాలో 1.26 లక్షల ఎకరాల్లో మిర్చి సాగయింది. 2023–24లో 1.48 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవడం విశేషం.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయానికి సుంకేసుల రిజర్వాయర్‌ నుంచి మంగళవారం కూడా వరద ప్రవాహం కొనసాగింది. 4,446 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు 4,451 క్యూసెక్కుల వరద నీరు సోమవారం నుంచి మంగళవారం వరకు విడుదలైంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో 0.169 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 335 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్‌వాటర్‌ నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 1210 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 367, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 64.4208 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 841.70 అడుగులకు చేరుకుంది.

Advertisement
Advertisement