Sakshi News home page

పట్టాభిషేకానికి వేళాయె!

Published Wed, Nov 15 2023 1:52 AM

 పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన లే అవుట్‌ 
 - Sakshi

● బొగ్గులైన్‌ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న 285 కుటుంబాలు ● నిరాశ్రయులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ● కర్నూలు హైవే పక్కనే ఇళ్ల స్థలాలు ● లేఅవుట్‌ అభివృద్ధి, వసతుల కల్పన ● ప్రస్తుతం ఇక్కడ సెంటు విలువ రూ.10 లక్షల పైనే ● నేడు పట్టాలను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే శిల్పా రవి

సంతోషంగా ఉంది

నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్‌లో 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని అధికారులు గతంలో చెప్పారు. ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించకుండా ఉచితంగా స్థల పట్టాలు పంపిణీ చేసిన తర్వాతనే ఖాళీ చేయిస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగా నేడు పట్టాలు చేతికందుతుండటం సంతోషంగా ఉంది.

– బి.లలితమ్మ, నిర్వాసితురాలు, నంద్యాల

రూ.10 లక్షల ఆస్తిని ఉచితంగా ఇస్తున్నారు

కూలీ నాలీ చేసుకుంటూ బతుకుతూ ఎన్నో ఏళ్లుగా బొగ్గులైన్‌ ప్రాంతంలోనే ఉంటున్నాం. మెయిన్‌ రోడ్డు కావడంతో చాలా ప్రమాదాలు జరిగాయి. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. ఇప్పుడు అభివృద్ధి చేసిన లే అవుట్‌లోనే స్థలాలు ఇస్తున్నారు. రూ. 10 లక్షల విలువ చేసే స్థలాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

– ఎస్‌.కలేషా, నిర్వాసితుడు, నంద్యాల

సీఎం, ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం

30 ఏళ్లుగా బొగ్గులైన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. మమ్మల్ని పట్టించుకున్న నాయ కులు లేరు. కానీ, నేడు మా ఇంటికి వచ్చి మరీ ఇంటి పట్టా ఉచితంగా ఇవ్వడం ఆనందంగా ఉంది. స్థలాన్ని కూడా అభివృద్ధి చేయడం బాగుంది. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశక్షర్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.

– బొల్లెద్దు మరియమ్మ,

నిర్వాసితురాలు, నంద్యాల

సాక్షి, నంద్యాల/నంద్యాల (సిటీ): వారంతా నిరు పేదలు. కొన్నేళ్లుగా రహదారి పక్కన ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. రయ్‌..రయ్‌ మంటూ దూసుకెళ్లే వాహనాల భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడిపారు. ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అయినా పేదరికంతో అక్కడి నుంచి వెళ్లలేని పరిస్థితి. చివరకు రహదారి విస్తరణలో రోడ్డున పడిన నిర్వాసితులకు మేమున్నామంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. లక్షల విలువైన స్థలాన్ని ఉచితంగా పట్టాగా అందజేస్తుండటంతో వారిలో పట్టరాని ఆనందం నెలకొంది. నంద్యాల పట్టణంలో బొగ్గులైన్‌ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు బుధవారం ప్రభుత్వం పక్కా పట్టాలు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంగా మారిన నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పట్టణ జనాభాకు అనుగుణంగా రహదారులు, డ్రైనేజీలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మలసత్రం నుంచి నూనెపల్లె వరకు రహదారి విస్తరణ చేపట్టారు. రోడ్డు విస్తరణతో పాటు రెండు వైపులా డ్రైనేజీ, మధ్యలో డివైడర్‌, వీధి దీపాలు, పాదాచారులు నడిచేందుకు వీలుగా ఫుట్‌పాత్‌ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ రహదారికి ఇరువైపులా బొగ్గులైన్‌లో కొన్నేళ్లుగా అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని దాదాపు 285 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే పనులు చేపట్టేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు శరవేగంగా లేఅవుట్‌ను అభివృద్ధి చేసి పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసి తమది పేదల ప్రభుత్వమని మరోసారి చాటింది.

నేషనల్‌ హైవే పక్కనే..

బొగ్గులైన్‌ నిర్వాసితులందరికీ నంద్యాల – కర్నూలు నేషనల్‌ హైవే పక్కనే ఇళ్ల స్థలాలు కేటాయించింది. కుటుంబానికి సెంటు చొప్పున బుధవారం పంపిణీ చేయనుంది. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్‌ విలువ ప్రకారం సెంటు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు పలుకుతోంది. ఇళ్లస్థలాలు ఇవ్వడమే కాకుండా కోట్ల రూపాయలతో లేఅవుట్‌ను అధికారులు అభివృద్ధి చేశారు. రూ.47 లక్షలతో 1.7 కిలోమీటర్ల మేర గ్రావెల్‌ రోడ్ల నిర్మించారు. ఒక్కో రోడ్డు 7 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా రూ.20 లక్షలతో బోర్లు కూడా వేయించారు. గ్రావెల్‌ రోడ్డు వెంబడి రూ.20 లక్షలతో విద్యుత్‌ స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement