ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Published Sat, Nov 25 2023 1:50 AM

ఇదే మాజెండా: వైఎస్సార్‌సీపీ జెండాలతో ప్రజలు - Sakshi

సాక్షి, నంద్యాల/ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది మండలాల నుంచి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ముందుగా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఇసాక్‌ బాషా, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, తొగురు ఆర్థర్‌, కర్నూలు మేయర్‌ బీవై రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక, శిల్పా కార్తిక్‌ రెడ్డి తదితరులు నల్లకాల్వ సమీపంలోని వైఎస్సార్‌ స్మృతివనంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాష్ట్రానికి మహానేత చేసిన సేవలను గుర్తు చేస్తుకున్నారు. అనంతరం వివిధ వర్గాల ప్రజలతో చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల వర్గాకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మేలును వివరించారు.

యువోత్సాహం

అనంతరం వైఎస్సార్‌ స్మృతివనం నుంచి ఆత్మకూరు పట్టణం వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘జై జగన్‌’ అంటూ నినదిస్తూ ముందుకు సాగారు. దాదాపు 500 బైక్‌లతో వైఎస్సార్‌ స్మృతివనం, నల్లకాలువ, బాపనంతపురం మీదుగా ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్‌ వరకు 12 కి.మీ మేర భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి వేలాది మంది ప్రజలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గౌడ్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నేతలపై దారిపొడువునా పూల వర్షం కురిపించారు. బాణసంచా కాల్చుతూ సందడి చేశారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

బహిరంగ సభపై ఏర్పాటు చేసిన గిరిజన నృత్యాలు, జానపద కళా ప్రదర్శన, కేరళ డ్రమ్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. వైఎస్సార్‌ స్మృతివనంలోని వైఎస్సార్‌ విగ్రహంపై డ్రోన్ల సహాయంతో కురిపించిన పూల వర్షం విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement