కమిషన్‌ తీర్పును ఖాతరు చేయని డాక్టర్‌కు అరెస్ట్‌ వారెంట్‌ | Sakshi
Sakshi News home page

కమిషన్‌ తీర్పును ఖాతరు చేయని డాక్టర్‌కు అరెస్ట్‌ వారెంట్‌

Published Tue, Dec 19 2023 1:46 AM

-

కర్నూలు(లీగల్‌ ): జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఇచ్చిన తీర్పును ఖాతరు చేయని డాక్టరుకు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు ప్రకాష్‌నగర్‌కు చెందిన పీ రోషిన్‌ఖాన్‌ తన భార్య కాన్పు కోసం ఎన్‌ఆర్‌ పేటలోని సరస్వతి నర్సింగ్‌ హోంలోని డా. వేణుగోపాల్‌ను సంప్రదించారు. అయితే నర్సింగ్‌ హోంలో డాక్టరు అందుబాటులో లేనందున వేరే ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. దీంతో ఆయన తన భార్యను స్థానిక యునానీ ఆసుపత్రి, ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు బాధితురాలికి కాన్పు చేయగా, శిశువు మృతి చెందింది. దీంతో డాక్టర్‌ వేణుగోపాల్‌పై కేసు దాఖలు చేశారు. కేసు విచారించిన ఫోరం.. ఫిర్యాదుదారుకు రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని 2016లో డాక్టరును ఆదేశించింది. దీంతో సదరు డాక్టరు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీల్‌ దాఖాలు చేశారు. అయితే ఆ అప్పీల్‌ కూడా డిస్మిస్‌ అయ్యింది. దీంతో ఫిర్యాది తీర్పు అమలు కోసం తిరిగి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే డాక్టరుకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ చైర్మన్‌ కరణం కిషోర్‌కుమార్‌, సభ్యులు ఎన్‌ నారాయణరెడ్డి, నసీమాకౌసర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

శ్రీశైలంప్రాజెక్ట్‌: సున్నిపెంట తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న కొంగలేటి కాశయ్య (40) అనే అవివాహితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టూటౌన్‌ ఎస్‌ఐ గంగయ్య యాదవ్‌ తెలిపిన వివరాల మేరకు.. కాశయ్య మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. గతంలో ఓసారి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటిపైన పడుకున్న వ్యక్తి తెల్లవారుజామున చూసే సరికి మిద్దె పై నుంచి కింద పడి మృతి చెంది ఉన్నాడు. కుటుంబీకులు గుర్తించి సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి రంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ గంగయ్య యాదవ్‌ తెలిపారు.

Advertisement
Advertisement