TS Mahabubnagar Assembly Constituency: పాలమూరుకు కృష్ణమ్మ..! వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రం ఇదే..!!
Sakshi News home page

పాలమూరుకు కృష్ణమ్మ..! వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రం ఇదే..!!

Published Thu, Sep 7 2023 1:28 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కింద నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధమైంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ఆధారంగా నార్లాపూర్‌ వద్ద నీటిని తోడే విధంగా స్టేజ్‌–1 పంప్‌హౌస్‌తో పాటు నీటిని నిల్వ చేసేలా 6.4 టీఎంసీల సామర్థ్యంతో అంజనగిరి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి కాగా.. మొదటి మోటారు పంప్‌ ద్వారా నీటిని ఎత్తిపోసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈనెల 16న ఆయన చేతుల మీదుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రాజెక్ట్‌ కింద మొదటి మోటారును సిద్ధం చేసిన అధికారులు ఈ నెల మూడో తేదీన డ్రైరన్‌ నిర్వహించారు. మొదటగా ఒక మోటారు పంప్‌ ద్వారా నీటి విడుదల ప్రారంభించి, తర్వాత విడతల వారీగా ఆయకట్టుకు నీరందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు ‘పాలమూరు’ ప్రాజెక్ట్‌ ప్రధాన ప్రచారాస్త్రం కానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అడ్డంకులను అధిగమించి..
కృష్ణానదిలో శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని 70 మండలాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీటితో పాటు పరిశ్రమలకు సైతం నీరందించాలనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

2016లో భూత్పూర్‌ మండలం కరివెన వద్ద సీఎం కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌ పనులను ప్రారంభించారు. మొదటి నుంచి పర్యావరణ, ఇతర అనుమతుల పేరుతో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రారంభంలో రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ప్రాజెక్టు చివరికి పనుల అంచనా వ్యయం రూ.52 వేల కోట్లకు పెరిగింది. తాజాగా మొదటి పంపును సిద్ధం చేయడంతో ప్రాజెక్ట్‌ కింద నీటి విడుదలకు రంగం సిద్ధమైంది.

వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రం ఇదే..!
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కింద నీటిని విడుదల చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు అధికార బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న నార్లాపూర్‌ పంప్‌హౌస్‌లోని ఇన్‌టేక్‌ వద్ద మొదటి మోటారు నీటి పంపింగ్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదేరోజు నార్లాపూర్‌ సమీపంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.

ఈ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈనెల 17న ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని అన్ని గ్రామాల ప్రజలు ఆలయాల్లోని దేవతామూర్తులను కృష్ణా జలాలతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా పండగలా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మొదటి పంప్‌తో ఎత్తిపోతలు..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కింద మొదటగా ఒక పంపుతో నీటిని ఎత్తిపోసేలా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రాజెక్ట్‌ స్టేజ్‌–1లో భాగమైన నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం గల పంప్‌ను ఇప్పటికే సిద్ధం చేయగా, ఈ నెల మూడో తేదీన అధికారులు డ్రైరన్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియ సక్సెస్‌ కావడంతో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మొదటి మోటారు ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం 8.51 టీఎంసీల సామర్థ్యం ఉన్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను నింపనున్నారు. ఆ తర్వాత స్టేజ్‌–1తో పాటు స్టేజ్‌–2, 3, 4 పంప్‌ హౌస్‌లలో మొదటి, రెండో మోటార్‌ను సిద్ధం చేసి ఏదుల, వట్టెం, ఉదండాపూర్‌ రిజర్వాయర్లను నింపేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. నార్లాపూర్‌లో మొత్తం తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయనుండగా.. ఎనిమిది మాత్రమే నీటి పంపింగ్‌కు వినియోగించనున్నారు.

వీటిలో ఏదైనా మోటార్‌ సాంకేతిక సమస్యలతో మరమ్మతులకు వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక మోటార్‌ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. సాగునీటి రంగంలో ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 139 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మోటార్ల (బాహుబలి)ను వినియోగించగా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో అంతకుమించి 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్లతో నీటిని ఎత్తిపోయనుండడం విశేషం.

Advertisement
Advertisement