ఒంటరి మహిళలే లక్ష్యం.. ఒకేరోజు 6 దొంగతనాలు..16 ఏళ్ల బాలుడు అరెస్ట్‌!

18 Aug, 2022 13:18 IST|Sakshi

న్యూఢిల్లీ: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. 20 ఏళ్ల లోపువారే అధికంగా చెడు వ్యసనాల ఉచ్చులో పడి బంగారు జీవితాన్ని కటకటాల పాలు చేసుకుంటున్నారు. ఓ 16 ఏళ్ల బాలుడు 24 గంటల్లో 6 దొంగతనాలకు పాల్పడిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున వెలుగు చూసింది. దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల‍్లో ఉండగా.. బాలుడు తన చేతివాటాన్ని చూపించాడు. దక్షిణ ఢిల్లీలోని నివాస ప్రాంతాల్లో ఆగస్టు 15వ తేదీన ఈ దొంగతనాలు జరిగాయని, నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. బాలుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. జల్సాల కోసం ఇప్పటికే 13 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీధుల్లో ఒంటరిగా వెళ్లే ఆడవాళ్లే అతడి టార్గెట్‌. బంగారు నగలు, మొబైల్‌ ఫోన్లు లాక్కెళుతుంటాడు. ఆగస్టు 15న తొలి ఘటన హౌజ్‌ఖాస్‌ ప్రాంతంలో ఉదయం 8 గంటలకు జరిగింది. స్కూటర్‌పై వచ్చి ఓ మహిళ సెల్‌ఫోన్‌ లాక్కెళ్లాడు. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు సాకెట్‌ ప్రాంతంలో ఓ మహిళ పర్స్‌ లాక్కెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే లాడో సరాయ్‌ మార్కెట్‌కు వెళ్లి ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ దొంగతనం చేశాడు. నాలుగో సంఘటన మాలవియా నగర్‌లో జరిగింది. ఆ తర్వాత ఓ మహిళ, ఫుడ్‌ డెలివరీ వర్కర్‌ వద్ద దొంగతనానికి పాల్పడ్డాడు. 

‘నిందితుడు నీలం రంగు స్కూటర్‌పై వచ్చినట్లు అన్ని ఫిర్యాదుల్లోనూ పేర్కొన్నారు. సీసీటీవీలు పరిశీలించి నిందితుడి కోసం గాలించాం. ఈ కేసులపై ప్రత్యేక నిఘా పెట్టాం. బుధవారం బీఆర్‌టీ ప్రాంతానికి అదే స్కూటర్‌పై వచ్చినట్లు సమాచారం అందింది. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, పట్టుకున్నాం. అతడి వద్ద రెండు ఫోన్లు ఉన్నాయి. అతడి ఇంట్లో బంగారు ఆభరణాలు లభించాయి. ఉదయం, సాయంత్రం పూట ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నాడు. ’ ‍అని దక్షిణ డీసీపీ బెనిత మారీ జైకర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం..15ఏళ‍్ల బాలికను తుపాకీతో కాల్చి పరార్‌!

మరిన్ని వార్తలు