జుట్టుపట్టుకుని లాగి కొడుతూ... ‘మై గరీబ్‌ ఆద్మీ హూ’ అన్న విడిచి పెట్టలేదు..

9 Aug, 2021 18:36 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పోలీసులు.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు.  బిల్వారా జిల్లాలోని.. ఒక దేవాలయం ముందు చెప్పులు అమ్మే వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారింది. వివరాలు.. బిల్వారాలోని స్థానిక దేవాలయం ముందు ఒక దివ్యాంగుడు చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నాడు.  ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్‌లు అక్కడికి చేరుకుని చెప్పుల షాపును తీసేయాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా..  అతడిని నోటికొచ్చినట్లు దుర్భాషాలాడారు. అతడిని బయటకు లాగి జుట్టుపట్టుకుని విచక్షణ రహితంగా కొట్టసాగారు. రోడ్డుపై లాక్కెళుతూ క్రూరంగా ప్రవర్తించారు.

ఆ దివ్యాంగుడు ‘మై గరీబ్‌ ఆద్మీ హూ’ నన్ను విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికి పోలీసులు విడిచిపెట్టలేదు. అయితే, స్థానికులు పోలీసులను ఎవరు కూడా వారిని ఆపే సాహసం చేయడం లేదు. అక్కడే ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై బిల్వారా పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ  సంఘటపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. కాగా, గతంలో లక్నో సమీపంలోని ఉన్నావ్‌లో 18 ఏళ్ల కూరగాయలు అమ్మే వ్యక్తిపై పోలీసులు ఇలానే క్రూరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ వ్యక్తి కొన్నినెలల తర్వాత మృతిచెందాడు. దీంతో బంధువులు అతని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఉన్నతాధికారులు దిగివచ్చి న్యాయం చేస్తామని హమీ ఇ‍వ్వడంతో బంధువులు తమ నిరసనను మానుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరగటంతో పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు