జాతీయ జెండా విలువేంటో తెలుసా? | Sakshi
Sakshi News home page

Respect National Flag: త్యాగధనుల రక్తానికి ప్రతీక.. అలా చేయొద్దు ప్లీజ్‌

Published Sun, Aug 15 2021 8:45 AM

75 Years Of Independence Respect National Flag Trend Viral - Sakshi

జాతీయ జెండా అంటే.. ప్రతీ దేశానికి ఒక గుర్తింపు. మన మువ్వెన్నెల జెండా.. జాతి ఔనత్యానికి ప్రతీక. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వీరుల త్యాగానికి ప్రతీకల్లో ఒకటి. అందుకే జాతీయ పతాకాన్ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత కూడా. పంద్రాగష్టు, గణతంత్ర దినోత్సవాలప్పుడు ఉప్పొంగే దేశభక్తి.. జెండాను గుండెలపైకి చేరుస్తుంది. కానీ, ఈరోజుల్లో అయినా జాతీయ జెండాకు నిజమైన గౌరవం అందుతోందా? అని వజ్రోత్సవాల వేడుకల(75వ) సందర్భంగా సోషల్‌మీడియా #RespectNationalFlag హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నిస్తోంది.

ఎవరైనా, ఎప్పుడైనా గౌరవానికి భంగం కలగని రీతిలో జాతీయ జెండా(National flag)ను ఎగరేయవచ్చు. 2002 కంటే ముందు భారతీయ పౌరులు స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో జెండా ఎగరేయడానికి వీలుండేది కాదు. కానీ, 2002లో సుప్రీం కోర్టు ఫ్లాగ్ కోడ్‌ను మార్చింది. మిగిలిన రోజుల్లోనూ జెండాను అవమానం కలగకుండా.. పగటి పూట ఎగరేయవచ్చని స్పష్టం చేసింది.

దేశ పండుగల నాడు జెండాను గౌరవించుకోవాలనుకోవడం మంచిదే!. కానీ, ఆ వంకతో రంగుల్ని ప్రదర్శించడం ఎంత వరకు సమంజసం. జెండా అంటే పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు. డ్రస్సుల్లో, ముఖానికి రంగులుగా పులుముకోవడం, వాట్సాప్‌, ఫేస్‌బుక్కుల్లో ప్రచారం కోసం జెండాపై రాతలు, ఫొటోలతో నింపడం అపవిత్రం చేసినట్లే అవుతుంది. జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ ఈ-కామర్స్‌ సైట్లపై అగ్గిమీద గుగ్గిలం అయ్యేవాళ్లకు.. జాతీయ జెండాను అవమానించడమూ నాన్‌-బెయిలబుల్‌ నేరం అని తెలుసో లేదో. జెండాను తిరగేసి ఎగరేయడం, కింద పడుకోబెట్టడం లాంటివి చేస్తే చట్టం సహించదు కూడా. 

జెండా ఎగరేసే ఆత్రుతలో, నిర్లక్క్ష్యంతో ఉల్టా-పల్టా ఎగరేసి అవమానించేవాళ్లు ఎలాగూ ఉంటారు. అది వాళ్ల విచక్షణకే వదిలేద్దాం. కానీ, కమర్షియల్‌ మార్కెటింగ్‌, ప్రచారాల కోసం జెండాను ఉపయోగించుకునేవాళ్లు, జెండాలను రోడ్డున పడేసే వాళ్ల సంగతి ఏంటి?. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరూ అతీతులు కాదు.. అంతా జాతీయ పతాకాన్ని-గేయాన్ని గౌరవించి తీరాల్సిందే. పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ విషయంలో పాఠాలు చెబితే బాగుండు. జై హింద్‌.

-ట్విటర్‌లో ఉవ్వెత్తున ఎగసిన #RespectNationalFlag

Advertisement
Advertisement