స్విమ్మింగ్‌ పూల్‌ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన! | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌ పూల్‌ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!

Published Sat, May 4 2024 8:21 AM

Amitabh Bajpai Takes Bath In Bathtub Near Swimming Pool

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి నానారావ్‌ పార్కులో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన స్విమ్మింగ్‌ పూల్‌ ఎన్నాళ్లయినా అందుబాటులోకి రాకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్‌ బాజ్‌పాయ్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

కాన్పూర్‌ పట్టణంలోని నానారావ్ పార్క్  ఎంతో పురాతనమైనది. యోగి ప్రభుత్వం పార్కు నిర్వహణ, సుందరీకరణకు సంబంధించి పలు వాగ్దానాలు చేసింది. వీటిలో స్విమ్మింగ్‌ పూల్‌ను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒకటి.  అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం పూర్తికాలేదు. దీనిపై ఎస్పీ ఎమ్మెల్యే  అమితాబ్‌ బాజ్‌పాయ్‌ నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఆయన ఒక చిన్న బాత్ టబ్‌తో ఈ పార్కుకు చేరుకుని, దానిని నీటితో నింపారు. ఆ తర్వాత  ఆ టబ్‌లో ఆయన కూర్చున్నారు. దానిలోనే ఎంజాయ్‌ చేస్తూ, స్వీట్లు కూడా తిన్నారు. పైగా పక్కనే ఒక బ్యానర్‌ తగిలించి, దానిపై ‘రూ.11 కోట్ల విలువైన స్విమ్మింగ్‌ పూల్‌ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు’ అని రాశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్విమ్మింగ్‌ పూల్‌పై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, నగర ప్రజలు వేసవిలో ఇక్కడ  ఎంజాయ్‌ చేయలేకపోతున్నారని వాపోయారు. ఈ కొలను 2023లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదన్నారు. దీని నిర్మాణంలో ఆర్థిక సమస్య లుంటే తమకు తెలియజేయాలని, అప్పుడు ప్రజల నుండి విరాళాలు సేకరించి అందజేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement