ఓ వైపు ఆహ్వాన ఏర్పాట్లు, మరో వైపు టెన్షన్‌ | Sakshi
Sakshi News home page

చిన్నమ్మకు జ్వరం

Published Thu, Jan 21 2021 6:40 AM

Amma Makkal Munnetra Kalagam Preparation For Welcoming Sasikala From Jail - Sakshi

సాక్షి, చెన్నై: చిన్నమ్మను ఆహ్వానించేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లలో మునిగిన నేపథ్యంలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలు ఆ శిబిరంలో ఉత్కంఠను రేపాయి. జైలులో చిన్నమ్మ జ్వరంతో బాధపడుతున్నట్టు, ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన సమాచారంతో ఆ శిబిరంలో కలవరం బయలుదేరింది. జైలు నుంచి శశికళ బయటకు వచ్చినా, అన్నాడీఎంకేకు ఢోకా లేదని, అమ్మ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్షా కాలం ముగియడంతో ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఆహా్వనం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లలో మునిగాయి. హొసూరు నుంచి చెన్నైకి కాన్వాయ్‌ రూపంలో ర్యాలీకి నిర్ణయించారు. శశికళ కోసం పోయెస్‌గార్డెన్‌లో రూపుదిద్దుకుంటున్న భవనం ఐటీ వివాదంలో ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

టీనగర్‌లోని చిన్నమ్మ వదినమ్మ ఇలవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో తాత్కాలికంగా చిన్నమ్మకు బస ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం చిన్నమ్మ జ్వరం బారినపడ్డ సమాచారంతో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాల్ని కలవరంలో పడేసింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న చిన్నమ్మను బెంగళూరులోని శివాజీ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చిన సమాచారం ఉత్కంఠలో పడేసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు , స్వల్ప శ్వాస సమస్య తలెత్తినట్టుగా జైళ్ల శాఖ వర్గాలు పేర్కొనడం కాస్త ఊరట.

Advertisement
Advertisement