స్వర్ణ దేవాలయం సమీపంలో మరో పేలుడు.. స్థానికుల భయభ్రాంతులు..

8 May, 2023 12:47 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు ఘటన జరిగింది. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో హెరిటేజ్ స్ట్రీట్‌లో భారీ శబ్దంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక్కరు గాయపడ్డారు. శనివారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో పేలుడు జరగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.

ఒకే ప్రాంతంలో వరుస పేలుళ్లు జరుగుతుండటంతో స్థానికులు హడలిపోతున్నారు. పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌,  ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పంజాబ్ డీజీపీ తెలిపారు. ఇది ఐఈడీ పేలుడు కాదని స్పష్టతనిచ్చారు. తక్కువ తీవ్రతగల పేలడు అని పేర్కొన్నారు.

అయితే పేలుళ్లకు గల కారణాలు పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని మాత్రం తెలిపారు. శనివారం జరిగిన ఘటనలో పేలుడు పదార్థాలతో పాటు మెటల్‌ను ఉపయోగించినట్లు వెల్లడించారు. రెస్టారెంట్‌లోని చిమ్నీలో ఈ పేలుడు జరిగింది.  ఈ ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలు గాయపడ్డారు.
చదవండి: టెక్సాస్‌ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి

మరిన్ని వార్తలు