Arvind Kejriwal: తీహార్ జైల్లో సీఎం కేజ్రీవాల్‌ దినచర్య ఇదే | Sakshi
Sakshi News home page

Arvind Kejriwal: తీహార్ జైల్లో సీఎం కేజ్రీవాల్‌ దినచర్య ఇదే

Published Mon, Apr 1 2024 2:40 PM

Arvind Kejriwal Tihar Routine: Wake Up At 6 30 Dal Sabzi For Lunch Dinner - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్‌ జైలుకు వెళ్లారు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ నేటితక్ష(సోమవారం) ముగియడంతో ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు 15 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు అధికారులు.

కాగా లిక్కర్‌ కేసులో తీహార్‌ జైలుకు వెళ్లిన నాలుగో ఆప్‌ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌. ఆయన కంటే ముందు ఎంపీ సంజయ్‌ సింగ్‌, మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ జైలుపాలయ్యారు. కేజ్రీవాల్‌కు తిహార్‌ జైలు నంబర్‌ 2 కేటాయించారు. మనీష్‌ సిసోయిడా జైలు నంబర్‌ 1, సత్యేంద్ర జైన్‌ జైలు నంబర్‌7, సంజయ్‌ సింగ్‌ జైలు నెంబర్‌ 5లో ఉంటున్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత జైలు నెంబర్‌ 6లో మహిళా విభాగంలో ఉన్నారు. కాగా లిక్కర్‌ స్కాంలో సౌత్‌ గ్రూప్‌లో కవిత భాగమయ్యారని, ఆమె ఆప్‌కు వంద కోట్ల వరకు లంచంగా ఇచ్చారని ఆరోపిస్తూ ఈడీ ఆమెను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

జైలులో కేజ్రీవాల్‌ దినచర్య
తీహార్‌ జైల్లో ఇతర ఖైదీలతోపాటు కేజ్రీవాల్‌ దినచర్య సూర్యోదయం నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు ఆయన లేవనున్నారు.  అల్పాహారంగా టీ, బ్రెడ్‌ ఇవ్వనున్నారు. స్నానం చేసిన తర్వాత ఒకవేళ విచారణ ఉంటే కేజ్రీవాల్ కోర్టుకు హాజరు అవుతారు. లేదా తన న్యాయ బృందంతో సమావేశమవుతారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య భోజనం అందించనున్నారు. లంచ్‌లోకి  అయిదు రోటీలు లేదా అన్నంతోపాటు పప్పు, మరో కూర ఇవ్వనున్నారు.

భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటల వరకు కేజ్రీవాల్‌ తన సెల్‌లో ఉండనున్నారు. 3:30కు కప్పు టీ, రెడు బిస్కెట్లు స్నాక్స్‌ కింద తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తమ న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటు ఉంది. అదే విధంగా సాయంత్రం 5.30 గంటలకు రాత్రి భోజనం అందించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు మళ్లీ తన సెల్‌లోకి వెళ్లనున్నారు.
చదవండి: ఐటీ నోటీసులు.. కాంగ్రెస్‌కు భారీ ఊరట

జైలు కార్యకలాపాల సమయంలో తప్ప కేజ్రీవాల్ టెలివిజన్ చూసే వెసులుబాటు కల్పించారు. వార్తలు, వినోదం, క్రీడలంతో సహా 18 నుంచి 20 ఛానళ్లు చూసేందుకు అనుమతి ఉంది. వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. కేజ్రీవాల్‌కు డయాబెటిస్‌ ఉండటం వల్ల ఆయనకు రోజు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయనున్నారు వైద్యులు. అంతేగాక సీఎం అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనకు ప్రత్యేక ఆహారం అందజేయాలని ఆయన న్యాయవాది కోరారు.

కేజ్రీవాల్‌కు వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చు. అయితే, జైలు అధికారుల వద్ద వారి పేర్లు తప్పినసరిగా లిస్ట్‌ చేసి ఉండాలి. కస్టడీలో చదువుకునేందుకు మూడు పుస్తకాలు చ‌దువుకునేందుకు కేజ్రీవాల్‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని న్యాయ‌వాదులు కోరారు. భ‌గ‌వ‌ద్గీత, రామాయ‌ణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలు కేజ్రీవాల్ చ‌దువుకుంటార‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టులో తెలిపారు. ఇందుకు కోర్టు అనుమతించింది.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఈడీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ తొమ్మిది సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఊరట కోసం కేజ్రీవాల్‌ కోర్టులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. దీంతో.. సివిల్‌ లేన్స్‌లోని నివాసంలో  మార్చి 22వ తేదీన తనిఖీల పేరుతో వెళ్లిన ఈడీ.. కొన్ని గంటలకే ఆయన్ని అరెస్ట్‌ చేసి తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్‌ రికార్డుల్లోకి ఎక్కారు.

Advertisement
Advertisement