ఎవడైతే నాకేంటి.. కాబోయే భర్త పచ్చి మోసగాడని తెలిసి అరెస్ట్‌ చేసింది

6 May, 2022 07:33 IST|Sakshi

నా జీవితం నాశనం అవ్వకుండా కాపాడారు. అతనంత పచ్చి మోసగాడని తెలీదు. విషయం నా దాకా తీసుకొచ్చిన ఆ ముగ్గురికి జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్లు నా కళ్లు తెరిపించారు. అంటోంది అస్సాం(అసోం) నాగావ్‌కు చెందిన ఎస్సై జున్మోనీ రభా. సోషల్‌ మీడియాలో ఈ ధైర్యశాలి పోలీస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

అసోంలో ఈ మహిళా పోలీసు అధికారిణి.. తన కాబోయే భర్త మోసగాడని తెలియడంతో ఏమాత్రం వెనుకంజ వేయకుండా  అరెస్ట్ చేసింది. జున్మోనీ రభా నాగావ్‌లో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత అక్టోబరులో రానా పోగాగ్  అనే వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో ఆమె వివాహం జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రానా పోగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(పీఆర్వోగా) జున్మోనీ కుటుంబానికి పరిచయం చేసుకున్నాడు. 

అయితే, అతగాడు ఓఎన్జీసీలో పనిచేస్తున్నానని పలువురిని నమ్మబలికి.. ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అతనికి కాబోయే భార్య ఒక ఎస్సై అని, పైగా నిజాయితీకి మారుపేరని తెలియడంతో ముగ్గురు బాధితులు ఆమెను ఆశ్రయించారు. దీంతో వాళ్ల నుంచి ఫిర్యాదు తీసుకుని మరి రానా పోగాగ్ ను అరెస్ట్ చేసింది. మధ్యవర్తి ద్వారా వచ్చిన ఆ సంబంధాన్ని పెద్దలే తీసుకురావడంతో తాను మంచోడనే అనుకున్నానంటూ ఆమె చెబుతోంది. ఇదిలా ఉంటే.. జున్మోనీకి ధైర్యశాలి అధికారిణి అనే పేరుంది. గతంలో ఎంతో సంక్షిష్టమైన కేసుల్ని సాహసోపేతంగా డీల్‌ చేశారామె. అందుకే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలోనూ ఆమె డేరింగ్‌ స్టెప్‌ తీసుకుందని పలువురు కొనియాడుతున్నారు.

చదవండి: పాక్‌ నుంచి రిందా కుట్ర

మరిన్ని వార్తలు