మాల్గుడి మహాశయుడు: ఆర్‌.కె.నారాయణ్‌

17 Jul, 2022 13:52 IST|Sakshi

చైతన్య భారతి: 1906–2011

మన దేశానికి గర్వ కారణంగా నిలిచిన భారతీయ ఆంగ్ల కథా సాహిత్యానికి పునాదులు వేసిన వైతాళికులు రాసిపురం కృష్ణస్వామి నారాయణ్‌! ఆయన 1906లో మద్రాసులోని ఒక సంప్రదాయ కుటుంబంలో ఎనిమిదవ సంతానంగా జన్మించారు. ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్‌.కె.లక్ష్మణ్‌ ఆయన పెద్దన్నయ్య. ఆర్‌. కె. నారాయణ్‌ చిన్నతనం నుంచి కౌమార దశకు వచ్చేవరకు అమ్మమ్మ ఇంటి దగ్గరే పెరిగారు. మైసూరులో ఆయన తండ్రి మహారాజా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమితులైనప్పుడు నారాయణ్‌ మళ్లీ తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నారు.

చదువుకుంటున్నప్పుడు ఆయన ధ్యాస చదువు మీద ఉండేది కాదు. ఇంగ్లిష్‌ పాఠ్య పుస్తకం చదవడానికి చాలా విసుగనిపించడంతో చదవక, చదవలేక.. నారాయణ్‌ కళాశాల ప్రవేశ పరీక్షలో తప్పారు. తరువాత మళ్లీ ఎలాగో ప్రవేశ పరీక్ష రాసి మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. నారాయణ్‌ కథా రచయితగా తన జీవితాన్ని 1935లో ‘స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌’ అనే కథతో మొదలుపెట్టారు. ‘మాల్గుడి’ అనే ఊహా పట్టణం ఆయన తలపుల్లో రూపుదిద్దుకుని ఆయన నవలలకు నేపథ్యమైంది. ది బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్, ది ఇంగ్లిష్‌ టీచర్, మిస్టర్‌ సంపత్, ద ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్, ది వెండర్‌ ఆఫ్‌ స్వీట్స్, ది పెయింటర్‌ ఆఫ్‌ సైన్స్, ఎ టైగర్‌ ఫర్‌ మాల్గుడి పేరుతో వెలువడిన నారాయణ్‌ రచనలు భారతీయ ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని సంపాదించుకున్నాయి.

స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ను అచ్చు వేయడానికి మొదట నారాయణ్‌కు ప్రచురణకర్తలు లభించలేదు. రాత ప్రతిని ఆయన గ్రాహమ్‌ గ్రీన్‌కు చూపించారు. ఆయన దానిని చదివి, హృదయపూర్వకంగా ప్రశంసించి, దానిని ప్రచురించడానికి ఏర్పాట్లు చేశారు. ఇ.ఎం.పార్‌స్టర్, సోమర్‌ సెట్‌ మామ్‌ల మాదిరిగా నారాయణ్‌కు కూడా గ్రీన్‌ ఆరాధకుడిగా మారిపోయారు. విషాదం, హాస్యం మేళవిస్తూ ఆయన రాసే కథలు సహజంగానే ఆబాలగోపాలన్ని ఆకట్టుకున్నాయి. ఆయన జీవితానుభవాలనే ఇతివృత్తాలుగా చేసుకుని కథల్ని సృష్టించారు.

1958లో ది గైడ్‌కు ఆయనకు సాహిత్య అకాడెమీ అవార్డు లభించగా, 1980లో రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లిటరేచర్‌ ఆయనను ఎ.సి.బెన్సన్‌ అవార్డుతో సత్కరించింది. ఒక్కమాటలో.. సులభమైన భాష, శైలితో ఆర్‌.కె.నారాయణ్‌ రాసిన విషాద, హాస్య రచనలు ఆంగ్ల సాహిత్యంలో భారతీయ కథలకు కని విని ఎరుగని విధంగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. 
–  అంజూ సెహ్‌గల్‌ గుప్తా, ‘ఇగ్నో’ ప్రొఫెసర్‌

మరిన్ని వార్తలు