మహోజ్వల భారతి | Sakshi
Sakshi News home page

మహోజ్వల భారతి

Published Tue, Jul 12 2022 4:59 PM

Azadi Ka Amrit Mahotsav:Mahojwala Bharati - Sakshi

చోటే సాహెబ్‌ సత్యేంద్ర సిన్హా
సిన్హా బిహార్‌ 19వ ముఖ్యమంత్రిగా చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్‌ నారాయణ్‌ నడిపించిన విద్యార్థి ఉద్యమానికి దన్నుగా నిలిచారు. సిన్హాను ఆత్మీయంగా ‘చోటే సాహెబ్‌’ అని బిహార్‌ ప్రజలు పిలుచుకుంటారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌ పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆయన ఏడుసార్లు గెలిచారు. భారతదేశపు అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో ఒకరిగా ఆ కాలంలో సిన్హా గుర్తింపు పొందారు. నేడు సత్యేంద్ర నారాయణ్‌ సిన్హా జయంతి. 1917 జూలై 12న ఆయన బిహార్‌లో జన్మించారు. రాజ్‌పుత్‌ల వర్గానికి చెందినవారు. ఆయన తండ్రి డాక్టర్‌ అనురాగ్‌ నారాయణ్‌ సిన్హా  జాతీయోద్యమ నాయకులు. చంపారన్‌ సత్యాగ్రహంలో డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌తో పాటు, సిన్హా తండ్రి గాంధీజీకి సహాయంగా ఉన్నారు. ఆ తండ్రి కుమారుడిగా సత్యేంద్ర సిన్హా కూడా దేశ స్వాతంత్య్రోద్యమానికి, స్వాతంత్య్రం తర్వాత దేశంలో గాంధీ విలువల కొనసాగింపునకు ఎంతో కృషి చేశారు. సిన్హా తన 89 ఏళ్ల వయసులో 2006 సెప్టెంబరు 4న కన్నుమూశారు.

రాజ్యసభ రెజ్లర్‌
దారాసింగ్‌ ప్రొఫెషనల్‌ రెజ్లర్, నటుడు, రాజకీయ వేత్త. 24 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చారు. రామానంద్‌ సాగర్‌ టీవీ ‘రామాయణం’లో హనుమంతుడి పాత్రలో నటించారు. రాజ్యసభకు నామినేట్‌ అయిన తొలి క్రీడాకారుడు. పంజాబ్‌ మజా ప్రాంతంలోని ధర్మూచక్‌ గ్రామంలో రణ్‌ధావా జాట్‌ల కుటుంబంలో 1928 నవంబరులో దారా సింగ్‌ జన్మించారు.  స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆయన వయసు 19 ఏళ్లు. ఆ వయసులోనే సింగపూర్‌ వెళ్లారు. జీవిక కోసం అక్కడ ఒక మిల్లులో పని చేశారు. అక్కడే కుస్తీపై ఆసక్తిని ఏర్పరచుకుని, మెళకువలు నేర్చుకున్నారు. ఇండియా వచ్చాక టోర్నమెంట్స్‌లో పాల్గొని విజయాలు సాధించారు. మహరాజా హరిసింగ్‌ నుంచి వెండి కప్పును అందుకున్నారు. సింగ్‌ 1998లో భారతీయ జనతాపార్టీలో చేశారు.  నేడు ఆయన వర్ధంతి. 2012 జూలై 12న మరణించారు.

 

వైద్యానికి వ్యతిరేకి!
రాజేంద్ర కుమార్‌ బాలీవుడ్‌ నటులు. 1950లలో నటుడిగా ఆయన కెరీర్‌ మొదలైంది. 80కి పైగా చిత్రాల్లో నటించారు. జుబిలీ కుమార్‌గా ప్రసిద్ధులు. 1960లలో ‘మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌’ భారతీయ నటులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. తన కుమారుడు కుమార్‌ గౌరవ్‌ను పెట్టి ఆయన కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. 1970లో భారత ప్రభుత్వం రాజేంద్ర కుమార్‌ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. రాజేంద్ర సియాల్‌కోట్‌లోని పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో 1927 జూలై 20న జన్మించారు. ఆయన తాతగారు మిలటరీ కాంట్రాక్టర్‌. తండ్రి కరాచీలో టెక్స్‌టైల్‌ బిజినెస్‌ చేసేవారు. దేశ విభజన సమయంలో ఆ కుటుంబం తమ మొత్తం భూముల్ని, ఆస్తుల్ని పాకిస్తాన్‌లోనే వదిలి ఇండియా వచ్చేసింది. నేడు రాజేంద్ర కుమార్‌ వర్ధంతి. 71 ఏళ్ల వయసులో 1999 జూలై 12న ఆయన కన్నుమూశారు. వైద్యానికి, మెడిసిన్‌కు ఆయన వ్యతిరేకి. చివరికి మందులను నిరాకరించడం వల్లనే ఆయన చనిపోయారు.

Advertisement
Advertisement