బెంగాల్లో హింసపై హైకోర్టు సీరియస్‌

3 Jul, 2021 02:00 IST|Sakshi

మమత ప్రభుత్వం సరిగా స్పందించలేదంటూ వ్యాఖ్య 

బాధితుల ఫిర్యాదులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు

కోల్‌కతా: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అనంతర హింసాబాధితులు చేసే ఫిర్యాదులను తీసుకొని కేసులు నమోదు చేయాలని కలకత్తా హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. వీరందరికీ తగిన వైద్య సదుపాయం అందించాలని, రేషన్‌ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. తదుపరి న్యాయ విచారణ కోసం సంబంధిత డాక్యుమెంట్లన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేదిని కోరింది.

రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింస చెలరేగినట్లు కనిపిస్తోందని, అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిజాన్ని నిరాకరిస్తోందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ హింసలో పలువురు చనిపోయారని, పలువురిపై లైంగిక దాడులు జరిగాయని, మైనర్‌ బాలికలను కూడా వదిలినట్లు కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలామంది ఇళ్లూ వాకిళ్లు వదిలిపోవాల్సివచ్చిందని, ఇప్పటివరకు ప్రభుత్వం బాధితుల్లో ధైర్యం, నమ్మకం కలిగించే పని చేయలేదని విమర్శించింది. చాలామంది బాధితుల ఫిర్యాదులను సైతం పోలీసులు తీసుకోలేదని, కొందరిపై ఎదురు కేసులు పెట్టారని వ్యాఖ్యానించింది.  

సుప్రీం నోటీసులు 
మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తుకు సిట్‌ నియమించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. కాగా కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని బీజేపీ నేత సువేందు అధికారి స్వాగతించారు. ఎన్నికల అనంతర హింసపై తమ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. పలువురు బీజేపీ నేతలు ఈ సందర్భంగా మమతపై విమర్శలు గుప్పించారు.

బెంగాల్లో హింసపై జాతీయ మానవ హక్కుల సంఘంతో విచారింపజేయాలన్న సూచనను మార్చాలని బెంగాల్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు జూన్‌ 21న తోసిపుచ్చింది. బెంగాల్‌ పోలీసులు హింసను అడ్డుకోలేదన్న ఆరోపణల నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర హోంశాఖ కోరింది. అయితే హింసారోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పనిచేస్తుందన్న నమ్మకం తమకు కలగట్లేదని, అందుకే జాతీయ మానవ హక్కుల సంఘ విచారణకు ఆదేశించామని కోర్టు తెలిపింది. మరోవైపు సువేందు అధికారికి కేంద్రం ఇచ్చే రక్షణతో పాటు తమ ప్రభుత్వం అదనపు రక్షణ ఏర్పాట్లు చేస్తుందని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు