వీడియో: బట్టలు బాగోలేవంటూ మెట్రో ఎక్కనివ్వలేదు.. ఆ వ్యక్తి మాత్రం ఊరుకోలేదు

26 Feb, 2024 19:02 IST|Sakshi

Viral Video: మన దేశంలో రైతులకు దక్కే గౌరవం ఇదేనా? అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఆ పెద్దాయన వేసుకున్న దుస్తులు గలీజుగా ఉన్నాయంటూ.. మెట్రో రైలు ఎక్కనివ్వకుండా అడ్డుకోబోయారు సిబ్బంది. అయితే ఓ వ్యక్తి నిలదీతతో చివరకు అనుమతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 

సిలికాన్‌ వ్యాలీ సిటీగా చెప్పుకునే బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఓ రైతు తన బ్యాగ్‌తో రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌ వద్ద మెట్రో ఎక్కడానికి వచ్చాడు. టికెట్‌ తీసుకున్నాక సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు రాగానే రైతును మెట్రో సిబ్బంది నిలిపేశారు. దుస్తులు బాగోలేవంటూ మెట్రో ఎక్కడానికి ఆయన్ని అనుమతించలేదు. అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు.

ఈలోపు వెనకాలే వస్తున్న మరో ప్రయాణికుడు.. మెట్రో సిబ్బంది తీరుపై పశ్నించాడు. అతని వాగ్వాదం తర్వాతే.. చివరికి రైతు మెట్రో ఎక్కడానికి అనుమతించారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి పేరు కార్తీక్‌గా తెలుస్తోంది. చివరకు నెట్టింట దీనిపై చర్చ జరగడంతో.. సదరు సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను విధుల నుంచి తొలగించి మరీ దర్యాప్తునకు ఆదేశించినట్లు బెంగళూరు మెట్రో ప్రకటించింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు