మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, బెస్ట్‌పై డీజిల్‌ పిడుగు!

27 Jun, 2021 11:54 IST|Sakshi

ప్రతినెలా సుమారు రూ.40 లక్షల అదనపు భారం  

సాక్షి, ముంబై: తరుచూ పెరుగుతున్న డీజిల్‌ ధరల వల్ల బెస్ట్‌ సంస్థ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. సంస్థపై నెలకు సుమారు రూ.40 లక్షల మేర అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ.. తమ ఉద్యోగులకు నెలవారీ వేతనాలు ఇవ్వడానికి కష్టపడుతోంది. దీనికి డీజిల్‌ ధరలు కూడా తోడవడంతో సంస్థ మరింత నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదముంది.  

నెలకు 20 వేల లీటర్ల డీజిల్‌ 

బెస్ట్‌ సంస్థ ఆధీనంలో సొంత, అద్దెకు తీసుకున్న ఇలా 3,400 వరకు బస్సులున్నాయి. ఇందులో కొన్ని బస్సులు సీఎన్‌జీ, మరికొన్ని ఎలక్ట్రిక్, డీజిల్‌ ద్వారా నడుస్తున్నాయి. బెస్ట్‌కు సొంతంగా 1,900 బస్సులు ఉండగా వాటిలో 302 బస్సులు డీజిల్‌తో నడుస్తాయి. అదేవిధంగా అద్దెకు తీసుకున్న కొన్ని బస్సుల్లో డీజిల్‌తో నడిచే బస్సులున్నాయి. కొద్ది రోజులుగా పెట్రోల్‌తోపాటు డీజిల్‌ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా బెస్ట్‌ సంస్థ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతకుముందు ముంబైలో లీటరు డీజిల్‌ ధర రూ.91.87 పైసలుండేది. ఇప్పుడు ధరలు పెరగడంతో రూ.96.16 పైసలకు చేరుకుంది. బెస్ట్‌కు నెలకు 20 వేల లీటర్ల డీజిల్‌ అవసరముంటుంది. అందుకు రూ.17 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు నెలకు సుమారు రూ.40 లక్షల మేర అదనపు భారం పడుతోందని బెస్ట్‌ సంస్థకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.  

తగ్గిన ప్రయాణికులు 

ఇప్పటికే లాక్‌డౌన్‌వల్ల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం లేక బెస్ట్‌ సంస్థ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. బీఎంసీ పరిపాలన విభాగం అడపాదడపా అందజేస్తున్న ఆర్థిక సాయంతో ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. బెస్ట్‌ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, నేటి పోటీ ప్రపంచంలో అనేక ప్రైవేట్‌ వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. లోకల్‌ రైల్వే స్టేషన్ల బయట షేర్‌ ఆటోలు, ట్యాక్సీలు బెస్ట్‌ బస్సుల కంటే ముందే ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోతున్నాయి. ఆ తరువాత వచ్చే బస్సుల్లో ఎక్కడానికి ప్రయాణికులే ఉండడం లేదు. బెస్ట్‌ నష్టాల్లో కూరుకుపోవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి.  
 

మరిన్ని వార్తలు