తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై కేసు నమోదు.. | Sakshi
Sakshi News home page

తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై కేసు నమోదు..

Published Fri, Apr 12 2024 8:05 PM

Case against Tamil Nadu BJP chief Annamalai violating poll campaign time - Sakshi

చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అయితే అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 341  290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.

అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై తీవ్రవాదాన్ని, అల్లర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అహంకారం గురించి మాట్లాడే ప్రధాని అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలని సెటౌర్లు వేశారు.

అయితే డీఎంకే ఆరోపణలపై స్పందించన అన్నామలై ధీటుగా బదులిచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉంది. ఏ ఎన్నికల సంఘం దీన్ని ఆపుతుందని ప్రశ్నించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆర్డర్‌ ఉంటే దానిని తనకు చూపించాలని అన్నారు.

కాగా కోయంబత్తూరులో బీజేపీ తరపున అన్నామలై ఎంపీగా పోటీచేస్తుండగా. అధికార డీఎంకే గణపతి రాజ్‌కుమార్‌ను, అన్నాడీఎంకే సింగై రామచంద్రన్‌ను బరిలోకి దింపింది. అయితే కోయంబత్తూరు అన్నాడీఎంకే కంచుకోట అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో సీపీఎం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 38 చోట్ల డీఎంకే కూటమి విజయ బావుటాను ఎగరవేసింది.  
చదవండి: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ హై టెన్షన్‌.. భారతీయులకు కేంద్రం అలర్ట్‌

Advertisement
Advertisement