‘భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ | Sakshi
Sakshi News home page

‘భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’

Published Tue, Mar 12 2024 9:26 PM

Central Home Ministry Says Indian Muslims need not worry - Sakshi

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విధివిధాలను నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి సీఏఏ అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఏఏ చట్టంతో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడితున్నాయి. మరోవైపు.. ఈ చట్టం అమలుతో  ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడతారని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా సీఏఏ చట్టంపై ముస్లింల ఆందోళనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ముస్లింలు సీఏఏతో ఆందోళ చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చింది

‘భారతీయ ముస్లింలు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సీఏఏ చట్టంలో 18 కోట్లమంది ముస్లింలను ఇబ్బంది పెట్టే ఎటువంటి నిబంధన లేదు. ముస్లింలు తమ పౌరసత్వ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేశంలోని హిందూవులతో సమానమైన హక్కులు ఉంటాయి. సీఏఏ కింద ముస్లింలు పౌరసత్వాన్ని రుజువు చేయటానికి ఎటువంటి పత్రాలు సమర్పించాలిన అవసరం లేదు. ఇస్లాం మతం శాంతియుతమైంది. మతప్రాతిపదికగా ద్వేషం, హింసను బోధించదు. ఈ చట్టం కరుణ చూపే.. ఇస్లాం మతాన్ని హింస పేరుతో మసకబారనివ్వకుండా కాపాడుతుంది’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

కొన్ని ఇస్లాం దేశాలలో మైనారిటీల వేధింపుల కారణంగా.. ఇస్లాం పేరు మసకబారిందని తెలిపింది. ఇక.. సీఏఏ చట్టం ముస్లింకు వ్యతిరేకమని కొంతమంది ఆందోళన చెందటం అన్యాయమని పేర్కొంది. ఎవరి పౌరసత్వాన్ని లాక్కునే నిబంధన సీఏఏ చట్టంలో లేదని హామీ ఇస్తున్నట్లు చెప్పింది. మరోవైపు.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మళ్లికార్జున  ఖార్గే, ఎంపీ రాహుల్‌ గాంధీ.. సీఏఏ చట్టం వల్ల ముస్లిం మైనార్టీలు తమ పౌరసత్వాన్ని కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్‌లో ఓ ర్యాలీలో  పాల్గొన్న అమిత్‌ షా మండిపడ్డారు.

చదవండి: ‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత

Advertisement
Advertisement